Bhatti vikramarka People’s March 3 years
* మర్చిపోలేని మహాయజ్ఞం..
* భావోద్వేగానికి లోనైన డిప్యూటీ సీఎం భట్టి
* తెలంగాణ మట్టి బిడ్డల రుణం తీర్చుకుంటా..
* పీపుల్స్ మార్చ్ జ్ఞాపకాలతో ఉప్పొంగిన భట్టి విక్రమార్క హృదయం.
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తన పాదయాత్ర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తెలంగాణ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు.
* మర్చిపోలేని మహాయజ్ఞం..
సరిగ్గా మూడేళ్ల క్రితం, మార్చి 16, 2023న ఆదిలాబాద్ అడవుల్లో ప్రారంభమైన తన ప్రయాణాన్ని భట్టి ఒక ‘మహాయజ్ఞం’గా అభివర్ణించారు. “ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ప్రజా సమస్యల ఆవేదన.. ఈ నేల రుణం తీర్చుకోవాలనే తపనతో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం నాడు అడుగులు వేశాను” అని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు సాగిన 1364 కిలోమీటర్ల ప్రయాణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.

* పాదాలకు బొబ్బలు ఎక్కినా.. ఆత్మీయతే నడిపించింది!
పాదయాత్రలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ.. “నాడు పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయినా నన్ను ముందుకు నడిపించింది ప్రజల ఆత్మీయత మాత్రమే. పల్లెల్లో తల్లులు పెట్టిన గోరుముద్దలు, పొలాల్లో రైతన్నల కరచాలనం, నిరుద్యోగుల ఆశతో కూడిన చూపులు నాలో సంకల్పాన్ని రగిలించాయి” అని డిప్యూటీ సీఎం ఎమోషనల్ అయ్యారు. సామాన్యుడి రాజ్యం రావాలన్న లక్ష్యంతోనే అహర్నిశలూ శ్రమించినట్లు ఆయన వివరించారు.
* ప్రజా ప్రభుత్వం – ఏకైక లక్ష్యం:
నేడు రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ.. “నాడు పాదయాత్రలో ఏ కష్టాలనైతే నా డైరీలో రాసుకున్నానో, వాటన్నింటికీ పరిష్కారం చూపడమే నా ఏకైక లక్ష్యం. మన వనరులు మనకే దక్కాలి, ఆదాయం పేదలకే చేరాలి. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతూనే, ప్రతి మనిషికి సంక్షేమ ఫలాలు అందిస్తాం” అని స్పష్టం చేశారు.
చివరగా, తన వెంట నడిచిన కార్యకర్తలకు, నాయకులకు మరియు అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రజా సేవలో తన ఆఖరి శ్వాస వరకు ప్రజల వెంటే ఉంటానని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
