India Post GDS Recruitment notification 2026
ఆకేరు న్యూస్, డెస్క్: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోస్టల్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 25 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు.
* ముఖ్యమైన తేదీలు
జీడీఎస్ ఉద్యోగాలకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 31, 2026 నుంచి సెప్టెంబర్ 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు, రుసుము చెల్లింపు ప్రక్రియ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దరఖాస్తులో తప్పులను సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఎడిట్ అవకాశం ఉంటుంది.
* పదో తరగతి అర్హతతో దరఖాస్తు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. దరఖాస్తు చేస్తున్న పోస్టల్ సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషను పదో తరగతి వరకు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
* పరీక్ష లేకుండానే ఎంపిక
ఈ జీడీఎస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కంప్యూటర్ రూపొందించే మెరిట్ జాబితా ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. గ్రేడింగ్ విధానంలో మార్కులు ఉన్న అభ్యర్థుల కోసం నోటిఫికేషన్లో పేర్కొన్న 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఆధారంగా మార్కులను లెక్కిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు SMS, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎంపిక జాబితా విడుదలైన తర్వాత నిర్ణీత సమయంలో అసలు ధ్రువపత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
* ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు?
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ నియామకంలో అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు, తెలంగాణలో 419 ఖాళీలు ఉన్నట్లు అందుబాటులో ఉన్న వివరాలు పేర్కొంటున్నాయి. ఇతర రాష్ట్రాలు, పోస్టల్ సర్కిళ్లలోని ఖాళీల పూర్తి వివరాలను అధికారిక GDS పోర్టల్‌లోని వేకెన్సీ వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు టైమ్ రిలేటెడ్ కంటిన్యూయిటీ అలవెన్స్ (TRCA) విధానంలో వేతనం చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టుకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం ఉంటుంది. వీటితో పాటు నిబంధనల ప్రకారం కరువు భత్యం, వార్షిక 3 శాతం పెంపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. బీపీఎంగా ఎంపికైన అభ్యర్థులు శాఖీయ పోస్టాఫీసు నిర్వహణకు అవసరమైన తగిన భవనాన్ని నిబంధనల ప్రకారం సొంత ఏర్పాటుతో సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
సాధారణ కేటగిరీ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు రుసుము ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
* ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక GDS నియామక పోర్టల్ (https://www.indiapost.gov.in/gdsonlineengagement)లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం లాగిన్ అయి పదో తరగతి మార్కుల మెమోలో ఉన్న వివరాల ప్రకారం పేరు, వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి. ఫోటో, సంతకం, అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి, పోస్టల్ సర్కిల్, ఖాళీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దరఖాస్తు రుసుమును చెల్లించి సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా.. ఒక అభ్యర్థి ఒకే రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది.
* అధికారిక వెబ్సైట్ : https://www.indiapost.gov.in/gdsonlineengagement
* చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
