*తెలంగాణ సంపద ఇతర రాష్ట్రాల ఎన్నికలకా?
*ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలపై పాయింట్ల వారీగా విమర్శలు గుప్పించారు.
*ఈటల రాజేందర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు (Point-to-Point):
శాసనసభ నిర్వహణపై విమర్శ: తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నుండి మార్చి వరకు బడ్జెట్ సమావేశాలు జరగాలి. కానీ, ఈ ప్రభుత్వం కేవలం కొన్ని రోజులే సభను నడిపి, వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని, ప్రజల సమస్యలపై చర్చించలేదని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: గత ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజులు చెల్లించలేదు, ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి కూడా 8 నుంచి 9 వేల కోట్ల బకాయిలను పట్టించుకోవడం లేదు. కేవలం 500-600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులను క్లాసుల నుండి బయటకు పంపుతున్నారని, అవమానం భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
*రైతు భరోసా – కౌలు రైతుల మోసం:
ఎకరాకు 15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారు. కేవలం ఒక ఎకరాకు మాత్రమే డబ్బులు వేస్తూ రైతులను వంచిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చినందుకు రైతు బంధు కూడా రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారని అన్నారు.
కళ్యాణ లక్ష్మి మరియు తులం బంగారం: తులం బంగారం ఇస్తామన్న హామీ దేవుడెరుగు, కనీసం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సకాలంలో అందడం లేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ భూముల కబ్జా: హైదరాబాద్ భూములు అమ్మి పథకాలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూకామాందులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కోర్టు వివాదాల్లో ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి, వారితో కుమ్మక్కవుతున్నారని విమర్శించారు.
సంపద తరలింపు: తెలంగాణలో భూములు అమ్ముకున్న డబ్బులు, కాంట్రాక్టుల ద్వారా వసూలు చేసిన సొమ్మును ఇతర రాష్ట్రాల (కేరళ, బెంగాల్) ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
నిరుద్యోగ వృతి మరియు ఉద్యోగాలు: జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, నిరుద్యోగ యువత వ్యసనాలకు బానిసలవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు కూడా ఇవ్వకుండా కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారని గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీలు, 66 హామీల అమలు కోసం బిజెపి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజా పక్షాన పోరాడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
