*తెలంగాణ వనరులు దోచుకున్నరు
*పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్ద పీట
*ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
పదేళ్లు అధికారంలో ఉన్న పెద్దలు తెలంగాణ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు. వాళ్లే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. స్థానిక వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్లకు వాయిదాలు, మిత్తిలు చెల్లీస్తూ కూడా పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట స్తుందని తెలిపారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చెస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ప్రవేశ పెట్టిన ప్రతీ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి, నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు భరోసా, సన్నాలకు 500 బోనస్, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను చేపట్టి ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులు దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఇవాళ వాళ్లే సుద్దపూసల లెక్క మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. ఇక ప్రజల చేత పార్టీల చేత తిరస్కరించబడిన వాళ్ళు సిగ్గులేకుండా చాలా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో త్వరలోనే ఎమ్మార్వో, ఎంపీడివో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు దీనిపై త్వరలోనే దేవాదాయ శాఖ కమిషనర్ తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి 1400 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, తహసీల్దార్, ఎంపిడివో, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
