* శాంతియుత నిరసనే మార్గం
*పార్టీలకు అతీతంగా తరలిరావాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో మార్చి 7 ఉదయం 10 నుండి మార్చి 8 ఉదయం 10 వరకు 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రాంపూర్, రంగాపూర్, కందుగుల, ధర్మరాజుపల్లి, జూపాక, చిన్న పాపయ్య పల్లి గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని డంపింగ్ యార్డ్ వల్ల కలిగే కాలుష్యం కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని, ఇది మన ప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
ఈ పోరాటం ఏ ఒక్కరి కోసమో కాదని, మన యువత భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ఆరోగ్య రక్షణ కోసం చేస్తున్న యుద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లోనీ అక్కలు, చెల్లెమ్మలు, అన్నదమ్ములు, యువకులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని, సామాన్య ప్రజలకు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఈ పోరాటంలో హుజూరాబాద్ ప్రాంతంలోని వ్యాపారులు, రైతులు, కూలీలు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపాలని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు ఇప్పటికే దీక్షకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
