Kadiyam Srihari BJP criticism
* కొంతమంది సన్నాసులకు అభివృద్ధి కమిపించడం లేదు
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బీజేపీ తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అవమానిస్తోంది,
ఆ పార్టీ నేతలు దుర్మార్గమైన మాటలతో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, 60 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, మహిళా కమ్యూనిటీ భవనంతో పాటు ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే మహిళా బిల్లుకు లింక్ పెట్టి డిలీమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశ పెడితే ఏకగ్రీవంగా ఆమోదించబడేదని తెలిపారు. మహిళా బిల్లు పాస్ కావాలని బీజేపీ ఎంత మాత్రం లేదని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించడం కోసమే డిలీమిటేషన్ బిల్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. డిలీమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ నాయకులు అడుగడుగునా అవమానిస్తున్నారని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన రోజును బ్లాక్ డే అని, ఇండియా పాకిస్తాన్ ను విడగొట్టినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లను విడగొట్టారనే దుర్మార్గపు మాటలతో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సిగ్గులేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం గడిచిన 12 ఏళ్లలో తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని అన్నారు. బీజేపీ ప్రతిదీ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మహిళలు, పేద ప్రజల అభివృద్ధి కోసం కాదని ఆక్షేపించారు. కొంత మంది సన్నాసులు నియోజకవర్గంలో తట్టేడు మట్టి తీయలేదని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన ఈ రెండేళ్లలో 1400 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రెటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, దేవాదుల కెనాల్ మరమ్మత్తులు, సాగు నీరు, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హల్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ సన్నాసులకు ఈ అభివృద్ధి పనులు ఏవి కనిపించడం లేదని విమర్శించారు. జనగామ జిల్లాలో అత్యధిక సాగు విస్తీర్ణం అయిన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమని ఇది దేవాదుల కాలువల వల్ల జరగడం అత్యంత సంతృప్తి ఇచ్చే విషయం అని వెల్లడించారు.
మల్కాపూర్ గ్రామం ప్రత్యేకత కలిగిన గ్రామం అని, ఆదర్శ రైతులు, రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం అని తెలిపారు. మల్కాపూర్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. గ్రామానికి మరో 40 లక్షల సిసి రోడ్లు మంజూరు చేస్తానని తెలిపారు. గండి రామారం లిఫ్ట్-1 పనులను పూర్తి చేసి జులై నాటికి మల్కాపూర్ పెద్ద చెరువును గోదావరి జలాలతో నింపుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే నా సంకల్పం అని స్పష్టం చేశారు. ప్రతీది రాజకీయం చేయవద్దని పని చేసే వారిని ప్రోత్సాహించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతీ పని ప్రజలకు ఉపయోగపడుతుందని కావున పని చేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ జూలూకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఉప సర్పంచ్ పసుల వెంకటేష్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మనీ, సవిత, రజిత, వెంకట రాజ్యం, లలిత, రవి నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, పోలేపల్లి రంజిత్ రెడ్డి, రంగు రమేష్, దేవస్థానం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, హోసింగ్ శాఖ, తహసీల్దార్, ఎంపిడివో,డీపీఎం, ఎపిఎంలు, మహిళ సంఘాల ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
