Revanth Reddy Governor meeting
* ప్రొఫెసర్ కోదండ రామ్ , అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవుల ప్రస్తావన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్లో కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఆయనతో అనేక విషయాలు ముఖ్యమంత్రి చర్చించారు. ముఖ్యంగా విద్యారంగానికి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల్లో పెరగిపోతున్న మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించినట్లుగా తెలిసింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల నుంచి ప్రమాణ పత్రం తీసుకోవాలి. ఇదే అంశం పై జూన్ 12 న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమ నిర్వహణపై కూడా సీఎంతో గవర్నర్ చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయినారు.
* ఆ ఇద్దరి గురించి…?
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం మర్యాద పూర్వక భేటి అనిపించినప్పటికీ ప్రత్యేక అంశం కూడా ఉన్నట్లు గా తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ల ఎమ్మెల్సీ విషయం కూడా చర్చించినట్లు సమాచారం. అజారుద్దీన్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినప్పటికీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. ఈ నెల 30 లోపు ఏ పదవి లేక పోతే మంత్రి వర్గం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీల గురించే ప్రధానంగా చర్చ కొనసాగినట్లుగా తెలుస్తోంది.
————————————–
