Telangana RTC strike impact
ఆకేరు న్యూస్ డెస్క్ :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో, జేఏసీ పిలుపు మేరకు కార్మికులు నేడు తొలి షిఫ్ట్ నుంచే విధులను బహిష్కరించారు. ఈ సమ్మెకు రెండో జేఏసీ కూడా మద్దతు తెలపడంతో ప్రభావం రెట్టింపు అయ్యింది.
*బస్సులు డిపోలకే పరిమితం
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
*వరంగల్ లో ప్రయాణికుల ఇబ్బందులు
వరంగల్ రీజియన్లో సమ్మె ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హనుమకొండ ప్రధాన బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే కార్మికులు డిపోల వద్ద పహారా కాస్తూ, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో హనుమకొండ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి చూసి, చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
*కార్మికుల అరెస్ట్
సూర్యాపేట & కామారెడ్డి: కోదాడ డిపో వద్ద కార్మికులు బస్సుల కింద పడుకుని నిరసన తెలపగా, పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చివేసి అరెస్ట్ చేశారు.
*ప్రైవేట్ డ్రైవర్ల సాయం
కామారెడ్డిలో ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను బయటకు తీస్తుండగా జేఏసీ నేతలు తీవ్రంగా అడ్డుకున్నారు.
*నిలిచిపోయిన బస్సులు
నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 డిపోల్లో 350 బస్సులు నిలిచిపోయాయి. అయితే సుమారు 180 ఎలక్ట్రిక్ మరియు అద్దె బస్సులు పోలీస్ కాపలా మధ్య తిరుగుతున్నాయి.
*పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం
సంగారెడ్డి & మెదక్: సంగారెడ్డిలో అద్దె బస్సులను అధికారులు ఎస్కార్ట్ వాహనాల మధ్య నడిపిస్తున్నారు. మెదక్ డిపో వద్ద పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
*సమ్మె వేళ ప్రమాదం – కరీంనగర్లో ఆందోళన
సమ్మె దృష్ట్యా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్న క్రమంలో కరీంనగర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
*ప్రయాణికుల ఇక్కట్లు.. అడ్డగోలు వసూళ్లు
చర్లపల్లి రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు డబుల్, ట్రిపుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి వాహనాలు దొరకక ఆందోళనకు గురవుతున్నారు.
*గడువు ఇవ్వండి- విధుల్లోకి రండి
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ సమ్మెపై స్పందిస్తూ.. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని, దశల వారీగా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని ఆయన కోరారు.
*స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గం
అధికారులు మరోవైపు సుమారు 2 వేల అద్దె బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులు మాత్రం స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
