Farmer Market Charges Demand
ఆకేరు న్యూస్ వరంగల్ : మార్కెట్లో రైతులు తమ పంటను విక్రయించే సమయంలో చెల్లించే దాడ్వాయి, హమాలీ చార్జీలను ప్రభుత్వమే భరించాలని అఖిల భారత రైతు సమాఖ్య (AIKF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా మార్కెట్ కమిటీ బడ్జెట్ నుంచే ఈ ఖర్చులను చెల్లించి, అన్నదాతలను ఆదుకోవాలని ఆయన కోరారు.
మంగళవారం ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశంను కలిసి, మార్కెట్ సమస్యలపై వినతి పత్రాన్ని (మెమోరాండం) సమర్పించింది.
* మార్కెట్ చార్జీల రద్దు- మొక్కజొన్న కొనుగోళ్లు*
పంట విక్రయ సమయంలో రైతులపై పడే దాడ్వాయి, హమాలీ ఇతర చార్జీలను మార్కెట్ బడ్జెట్ నుంచే భరించాలి. ప్రస్తుత సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్నల కొనుగోలులో జాప్యాన్ని నివారించాలి. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా గోనె సంచులు, పరదాలు, రవాణా (ట్రాన్స్పోర్ట్) సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలి.
* రైతు సంక్షోభంపై ఆవేదన*
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, పండించిన పంటకు కనీస మద్దతు ధర (MSP) దక్కక రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు. “రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మద్దతు ధర చట్టం కోసం, మార్కెట్ దోపిడీని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
కుంటి సాకులతో మొక్కజొన్న కొనుగోళ్లను ఆపవద్దని, బేషరతుగా రైతుల నుంచి పంటను సేకరించి తక్షణమే చెల్లింపులు జరపాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. రెడ్డి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి, ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
