Paddy Procurement CPM Leaders Protest
* మే 11న కలెక్టరేట్ ముట్టడికి సిపిఎం హెచ్చరిక
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని లేనిపక్షంలో మే 11న ఛలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని సిపిఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను శనివారం సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సాదం రమేష్ మాట్లాడుతూ 10 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం తరలించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* రైతుల దుస్థితి
ఐకెపి, పిఏసిఎస్ సెంటర్లలో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ. 1600 నుండి 2 వేలు చెల్లిస్తున్నారు అన్నారు. ఉదయం ఎండలు, సాయంత్రం ఉరుములు-మెరుపులతో వస్తున్న గాలిదుమారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
* మిల్లర్ల దోపిడీ
ధాన్యం తూకంలో ఐకెపి, పిఎసిఎస్ సెంటర్లలో 41 కిలోలు కాకుండా 42, 44 కిలోలు జోకితేనే ధాన్యం బస్తాలు దించుకుంటామని హెచ్చరిస్తూ కొందరు మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు ఆరోపించారు. ఈ దందాలు వెంటనే ఆపాలి. లేకుంటే మిల్లుల ముందే ధర్నా చేపడతాం అని సాదం రమేష్ హెచ్చరించారు.
* డిమాండ్లు
కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు తక్షణమే డబ్బులు చెల్లించాలని, బస్తా 41 కిలోలకే కొనుగోలు చేయాలి,అదనపు తూకం ఆపాలి. మిల్లర్ల దోపిడీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* కలెక్టరేట్ ముట్టడి
కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, మిల్లర్ల దోపిడీని వెంటనే అరికట్టాలని లేని పక్షంలో ఈనెల 11న రైతులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని సాధన రమేష్ హెచ్చరించారు.
