Huzurabad Political Tensions
*హుజురాబాద్లో తారాస్థాయికి చేరిన రాజకీయ రగడ
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హెచ్చరికలు, తీవ్ర ప్రతిస్పందనలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో నిన్న నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి, మాటల యుద్ధానికి దారితీసింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్ చేసిన వ్యాఖ్యలు వాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు, నేతలు తీవ్రంగా కౌంటర్ ఇవ్వడంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
* కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ విప్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తో పాటు నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ..గతంలో అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంచడంలో కౌశిక్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల సహకారంతో నిధులు మంజూరు చేయించి ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుంటే, కౌశిక్ రెడ్డి ఓర్వలేక డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు తప్పవని హెచ్చరించారు.
* “బీఆర్ఎస్ శ్రేణుల తీవ్ర కౌంటర్
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కమలాపూర్ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు రాజేష్ ఒక వీడియోలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కళ్లపళ్లి సత్యనారాయణ రావు, పలువురు టిఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న ప్రజానాయకుడు పాడి కౌశిక్ రెడ్డిపై భౌతిక దాడికి దిగుతామని, రాళ్లతో కొడతామని హెచ్చరించడం సిగ్గుచేటని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిని టచ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు.
* నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం
ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం, బహిరంగ హెచ్చరికలు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఈ రాజకీయ రగడ కేవలం మాటలకే పరిమితం కాకుండా, నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయిన అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను మరింత ఆలస్యం చేసే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కంటే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే ప్రధానంగా మారడంతో అసలు లబ్ధిదారులకు అందాల్సిన ప్రయోజనాలు పక్కదారి పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
