Rahul Gandhi Economic Crisis Comments
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ ఆర్థిక పరిస్థితిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం ఒక పెద్ద ఆర్థిక తుఫాన్ (Economic Storm) అంచున ఉందంటూ ఆయన హెచ్చరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భారీగా పెరగడంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశంలో సామాన్య ప్రజలు, యువత, రైతులు, చిన్న వ్యాపారస్తులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
* కొద్దిమంది కోటీశ్వరుల కోసమే ఈ విధానాలు…
ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ పునాదులను బలహీనపరుస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మోదీ మార్చిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కేవలం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది శతకోటీశ్వరులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉంది. ఈ వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదు, త్వరలోనే కుప్పకూలుతుంది. కానీ, ఈ ఆర్థిక సంక్షోభం వల్ల మోదీకి గానీ, అదానీ-అంబానీలకు గానీ ఎలాంటి నష్టం జరగదు.. కేవలం దేశంలోని సామాన్య ప్రజలే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
* ధరల పెంపు యువతపై ప్రభావం..
దేశంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, వినియోగం (Consumption), మరియు చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నెపంతో దేశంలో ఇంధన ధరలను పెంచి సామాన్యుల నడుము విరుస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే పారదర్శకమైన, సమగ్రమైన విధానాలు అవసరమని, కానీ కేంద్రం ఆ దిశగా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ప్రజలను విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, ఆచితూచి ఖర్చు చేయాలని కోరుతూ.. ప్రధాని మోదీ మాత్రం విదేశీ పర్యటనలు చేస్తూ కాలం గడుపుతున్నారంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని భారీ షాక్‌ను ఎదుర్కోబోతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ :
UNNAO RAPE CASE | కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్ష రద్దు చెల్లదు
