Unnao Rape Case Verdict Kuldeep Singh Sengar
* ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ
* తీర్పు వెలువరించిన సుప్రీకోర్టు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెంగర్ శిక్షను నిలిపివేస్తూ (Suspension of Sentence) గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
* కుల్దీప్ సింగ్ సెంగర్ శిక్ష రద్దు చెల్లదు
సెంగర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. బాధితురాలికి మరియు సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని, తీవ్రమైన నేరాల్లో శిక్షను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. సెంగర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మరోసారి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాల ప్రభావం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.సెంగర్ ప్రధాన అప్పీలును రెండు నెలల లోపు పరిష్కరించేందుకు ప్రయత్నించాలని హైకోర్టుకు దిశానిర్దేశం చేసింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, వేసవి సెలవుల లోపు శిక్ష నిలిపివేత అంశంపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది.
* ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగా ..? కాదా..?
కేసులో చట్టపరంగా ఒక కీలక చిక్కుముడి ఉంది. ఢిల్లీ హైకోర్టు సెంగర్‌కు బెయిల్ ఇస్తూ.. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీరికి ఐపిసి సెక్షన్ 21 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కారు అని వ్యాఖ్యానించింది. దీనివల్ల ఆయనపై POCSO చట్టంలోని సెక్షన్ 5(c) అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మైనర్లపై జరిపే అత్యాచారం -( Aggravated Penetrative Sexual Assault) వర్తించదని పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ సాంకేతిక వాదనను తీవ్రంగా పరిగణించింది. ఒక ఎమ్మెల్యే సమాజంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తి అని, అటువంటి వారు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు POCSO చట్టం యొక్క అసలు ఉద్దేశం దెబ్బతినకూడదని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేను ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణించి శిక్షించవచ్చా అనే అంశాన్ని లోతుగా, మరోసారి పరిశీలించాలని హైకోర్టును కోరింది.
*శిక్షలో మార్పులు ఉంటాయా..?
ఒకవేళ కోర్టు ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ గా ఖరారు చేస్తే, శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. POCSO చట్టం ప్రకారం, సామాన్యుడు చేసే అత్యాచారం కంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసు, డాక్టర్, ఎమ్మెల్యే వంటి వారు చేసే నేరానికి గరిష్ట శిక్ష జీవిత కాలం జైలు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.
* ఉద్యోగం కోసం వెళ్తే బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం
జూన్ 2017 న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ఒక మైనర్ బాలిక, ఉద్యోగం కోసం కుల్దీప్ సెంగర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో 2018 ఏప్రిల్‌లో బాధితురాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. అదే సమయంలో బాధితురాలి తండ్రిని సెంగర్ సోదరులు కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీస్ కస్టడీలో తీవ్ర గాయాలతో ఆయన మరణించడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. 2019లో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు మరణించగా, ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది సెంగర్ చేయించిన కుట్రేనని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు జోక్యంతో కేసు ఢిల్లీకి బదిలీ అయ్యింది. 2019 డిసెంబర్లో ఢిల్లీ ట్రయల్ కోర్టు సెంగర్‌కు జీవిత ఖైదు మరియు రూ. 25 లక్షల జరిమానా విధించింది. కాగా నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశలు మళ్ళీ చిగురించాయి. జైలు నుంచి బయటకు రావాలనుకున్న సెంగర్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “UNNAO RAPE CASE | కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్ష రద్దు చెల్లదు”