Deputy Collector Sharmila Suspension
* విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీస్ వరకు అనేక ఫిర్యాదులు
* షర్మిల అవినీతి వ్యవహారంపై అంతర్గత విచారణ
* ఉట్నూర్ ఆర్డీఓగా బదిలీ చేసినా.. హెచ్ఎండీఏలోనే తిష్ట
* అనుమతి లేకుండా ఆఫీస్ దాటొద్దని ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఆమె పేరు షర్మిల. హోదా డిప్యూటీ కలెక్టర్. చాలా కాలంగా డిప్యుటేషన్ పై హెచ్ఎండీఏలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అవినీతి, అక్రమాలకు సంబందించి ఆ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్, మొదలుకొని సీఎం ఆఫీసు వరకు ఆమెపై బాధిత ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల వ్యవహారంపై అంతర్గత విచారణ చేసిన అధికారులు ఆమెను ముందుగా అక్కడి నుండి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆమెను కొంత కాలం క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ అధికారి (RDO ) గా, అదే విదంగా ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు.
* కుర్చీ వదిలేది లేదు
డిప్యూటీ కలెక్టర్ మాత్రం హెచ్ఎండీఏలో కుర్చీని వదలడం లేదు. ఉన్నతాధికారులు అనేక దఫాలుగా పోస్టింగ్ ఇచ్చిన స్థానానికి వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినా షర్మిల పెడ చెవిన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి . ప్రభుత్వ ఆదేశాలను లైట్ తీసుకోవడమే కాకుండా బదిలీ ఉత్తర్వులను ధిక్కరించారు. దీంతో ఆమె ప్రవర్తనను సీరియస్ గా తీసుకున్న సీసీఎల్ఏ కమిషనర్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు టీసీఎస్ (సీసీ&ఏ ) నియమావళి, 1991లోని నియమం 8 ప్రకారం డిప్యూటీ కలెక్టర్ షర్మిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈ నెల19వ తేదీన సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిల బదిలీ అయిన స్థానంలో జాయిన్ కానీ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్‌పై ప్రభావం పడిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని సీసీఎల్ఏ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్ షర్మిల పై సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్ళవద్దని పేర్కొన్నారు.
————————————
