Kadiyam Paddy Transportation Review
* స్పెషల్ డ్రైవ్ తో ధాన్యం మిల్లులకు తరలించాలి
* కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తూకం వేసిన ధాన్యాన్ని స్పెషల్ డ్రైవ్ తో మిల్లులకు తరలించాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులను కోరారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు, రవాణా అంశాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సివిల్ సప్లై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా అందిన సాగునీటితో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు, కాంటాలు, మిల్లులకు లోడింగ్, అన్ లోడింగ్ లలో కొంత ఆలస్యం అవుతుందని అన్నారు. నియోజకవర్గంలో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ఇందులో ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని ఇంకా మరో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో కాంటాలు అయి 30 వేల క్వింటాళ్ల బస్తాలు లోడింగ్ కు సిద్ధంగా ఉన్నాయని వాటిని వెంటనే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ధాన్యం మిల్లులకు తరలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఇసుక లారీలను ఊయోగించాలని కలెక్టర్ కి సూచించారు. అలాగే ఏ రోజు కాంటా అయిన ధాన్యం అదే రోజు లోడింగ్, అన్ లోడింగ్ అయ్యే విధంగా తక్షిణ చర్యలు చేపట్టాలని వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన కొన్ని మిల్లులలో ఖాళీ లేక ధాన్యం బస్తాలు దిగుమతి చేసుకోవడం లేదని కావున వెంటనే వాటి స్థానంలో ఖాళీ ఉన్న మిల్లులను రిట్యాగ్ చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు, రవాణా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆదిశగా అధికారులకు, మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్ చందర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
