Rajeev Kanakala School Controversy
* పిలిస్తే చీఫ్ గెస్ట్ గా వెళ్లాను
ఆకేరు న్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా ఒక ప్రైవేట్ స్కూల్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ‘వైబ్రాంట్ స్కూల్’ నిర్వహించిన వార్షికోత్సవ లేదా ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాజీవ్ కనకాల తన చేతుల మీదుగా మెమొంటోలు, షీల్డులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమం జరుగుతుండగా… ‘నవ తెలంగాణ విద్యార్థి శక్తి’ (NTVS) సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా నిరసనకు దిగారు. సదరు స్కూల్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన అనుమతులు లేవని, అలాంటి విద్యాసంస్థ కార్యక్రమానికి సెలబ్రిటీగా వచ్చి ఎలా ప్రమోట్ చేస్తారని రాజీవ్ కనకాలను నిలదీశారు. దీంతో స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బౌన్సర్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
* నాకేం సంబంధం లేదు బాబోయ్- రాజీవ్ కనకాల
ఈ వివాదం ముదరడంతో నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఒక వివరణాత్మక వీడియోను విడుదల చేశారు. రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ ఈ వివాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
* అభినందించడానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లాను…
“నేను కేవలం పిల్లలను ప్రోత్సహించడానికి, టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను అభినందించడానికే చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అంతకు మించి ఆ స్కూల్‌తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు కానీ, భాగస్వామ్యం కానీ లేవు. ఆ స్కూల్‌కు అనుమతులు లేవనే విషయం నాకు అక్కడికి వెళ్లే వరకు అస్సలు తెలియదు. విద్యార్థి సంఘాల వారు అడిగినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. నా ఫోటోలను స్కూల్ ప్రమోషన్లకు వాడొద్దని నిర్వాహకులకు చెప్పేశాను. తల్లిదండ్రులు కూడా పిల్లలను స్కూళ్లలో చేర్పించే ముందు అన్ని పత్రాలను పరిశీలించుకోవాలి. దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాగకండి” అని రాజీవ్ కనకాల ఆ వీడియోలో పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా స్పందించిన రాజీవ్ కనకాల వైఖరిని నెటిజన్లు, విద్యార్థి సంఘాల నేతలు సైతం అభినందిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
