Station ghanpur Bakrid Police Advisory
* రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మత సామరస్యానికి ప్రతికగా నిలిచే బక్రీద్ పండుగను సోదర భావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. బుధవారం ఆయన సర్కిల్ కార్యాలయంలో మాట్లాడుతూ రఘునాథపల్లి, లింగాల గణపురం, చిల్పూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా పండుగను మత సామరస్యంతో జరుపుకునే విధంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే సమస్య పరిష్కారానికి పోలీసులను కలవాలని కోరారు. యువత ఆవేశంతో చేస్తున్న చిన్న చిన్న తప్పులు శాంతిభద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉందని మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే ఆసక్తికరమైన పోస్టులు పెట్టడం ద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేసిన వారిపై పోలీస్ దృష్టి పెడతారని హెచ్చరించారు. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని రూరల్ సర్కిల్ పరిధిలో గొర్రెలు మేకల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పండుగ సీజన్ ఆసర చేసుకొని కొంతమంది గుర్తుతెలియని దుండగులు కార్లు ఇతర వాహనాల్లో గ్రామాల్లోకి చొరబడి మేకలను గొర్రెలను దొంగించే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామాలలో కొత్తగా వచ్చే వాహనాలు అనుమానస్పదంగా తిరిగే వ్యక్తుల పట్ల స్థానికులు నిఘా ఉంచాలని ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు దొంగతనాల నివారణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.
