Armur Brick Kiln Bonded Labour Case
* నలుగురు కార్మికులు మృతి? రంగంలోకి దిగిన జిల్లా జడ్జి
ఆకేరు న్యూస్, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో నాగరిక సమాజం తలదించుకునేలా ఘోర అమానుషం వెలుగుచూసింది. కేవలం 20 మంది కార్మికుల అనుమతి పత్రాల పేరుతో.. వందలాది మందిని ఇటుక బట్టీల్లో బంధించి వెట్టిచాకిరి చేయిస్తున్న దారుణ ఉదంతం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, ఆలూరు మండలాల పరిధిలో గల దేగం, మగ్గిడి ప్రాంతాల్లోని ఇటుక బట్టీలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి గారు స్వయంగా జరిపిన రెస్క్యూ ఆపరేషన్లో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి.
* 5 ఏళ్లుగా నరకయాతన.. ఫోన్లు, ఆధార్ కార్డులు సీజ్…
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 474 మంది కార్మికులు గత ఐదేళ్లుగా ఈ ఇటుక బట్టీల్లో బందీలుగా మగ్గిపోతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు కార్మికుల మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులను లాక్కొన్నారు. అంతేకాకుండా, కార్మికులు ఎవరూ పారిపోకుండా ఉండేందుకు వారి పిల్లలను సైతం బంధించి, వారిపై కఠిన నిఘా ఉంచినట్లు విచారణలో తేలింది. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ నరకకూపంలో ఐదేళ్లుగా కార్మికులు దయనీయ స్థితిలో బతుకీడుస్తున్నారు.
* నలుగురు మృతి.. మృతదేహాలు మాయం?
బాధితులు జిల్లా జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఇటుక బట్టీల నిర్వాహకుల వేధింపులు, సరైన వసతులు లేకపోవడం వల్ల నలుగురు కార్మికులు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. అయితే, ఆ మృతదేహాలను ఎవరికీ తెలియకుండా నిర్వాహకులే మాయం చేశారని కార్మికులు ఫిర్యాదు చేశారు.
* యజమానులపై కేసులు విచారణకు ఆదేశం…
బాధితుల ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన జిల్లా జడ్జి భారత లక్ష్మి.. ఈ ఘోరంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. కాగా, ఈ అక్రమ ఇటుక బట్టీలను ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇటుక బట్టీల నిర్వాహకులు తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ దారుణ ఘటన ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కులను కాలరాస్తూ, కార్మికుల ప్రాణాలతో ఆడుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
