Cockroach Janata Party
* వారం లోనే 1 కోటి ఫాలోవర్స్
* సీజేపీ పౌండర్ అభిజిత్ దీప్కే ఎవరూ..?
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : దేశ రాజకీయాల్లో సరికొత్తగా బొద్దింకల ( Cockroach ) పార్టీ ఆరంగేట్రం చేసింది. రాజకీయాల్లో బొద్దింకలు ఏంటి.. పార్టీ పెట్టడం ఏంటని అనుకుంటున్నారా..? వినడానికి నమ్మశక్యం గా లేదు కదా..! నిజమే అదీ బొద్దింకల రాజకీయ పార్టీనే.. అయితే బొద్దింకలు (Cockroach ) కలిసి ఏర్పాటు చేసిన పార్టీ మాత్రం కాదులెండి.. బొద్దింకల పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. అది డిజిటల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ ఎంతగా ప్రభావితం చూపుదంటే ..
భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ, ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన, అసాధారణమైన డిజిటల్ విప్లవం దేశాన్ని కుదిపేస్తోంది. కోట్ల రూపాయల ఫండింగ్ లేదు.. దేశవ్యాప్త క్యాడర్ లేదు.. భారీ సభలు, రోడ్ షోలు అంతకన్నా లేవు. దశాబ్దాల చరిత్ర ఉన్న కురువృద్ధ పార్టీ కాంగ్రెస్, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్న క్షేత్రస్థాయి దిగ్గజం బీజేపీ (BJP ) సైతం నోరెళ్లబెట్టేలా ఒక సరికొత్త ‘డిజిటల్ సునామీ’ దూసుకొచ్చింది. అదే.. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party )! సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కేవలం 5 రోజుల్లోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరించిన వ్యంగ్య రాజకీయ ప్లాట్‌ఫారమ్‌గా ఇది రికార్డు సృష్టించింది.
* ఒక్క వ్యాఖ్య దేశవ్యాప్త అగ్గిరాజేసిన యువత…
ఈ అసాధారణ ఉద్యమం వెనుక ఒక పెద్ద కోర్టు సీన్ ఉంది. 15 మే 2026న సుప్రీంకోర్టులో ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువత, కొందరు స్వచ్ఛంద జర్నలిస్టులు, ఆర్టీఐ (RTI) కార్యకర్తల తీరుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేసే కొందరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని సమాజానికి పట్టిన “కాక్రోచ్ (బొద్దింకలు)”, “పరాన్నజీవులు” (Parasites) అని సంబోధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు దావానలంలా వ్యాపించాయి. దేశంలో పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న ‘జెన్ జీ’ (Gen-Z) యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. “వ్యవస్థను ప్రశ్నిస్తే బొద్దింకలంటారా? అయితే మేమంతా బొద్దింకలమే! మా హక్కుల కోసం ఒక పార్టీని పెట్టుకుంటాం” అంటూ నెటిజన్లు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాగా తమ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ తర్వాత సుప్రీం కోర్టు వివరణ కూడా ఇచ్చింది ..
* గూగుల్ ఫామ్‌తో మొదలైన ‘అభిజీత్ దీప్కే’ ప్రస్థానం
ఈ అసంతృప్తిని సరిగ్గా అందిపుచ్చుకున్నాడు 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా విభాగంలో వాలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అభిజీత్, ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. మే 16న ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా కేవలం ఒక గూగుల్ ఫామ్ లింక్ షేర్ చేస్తూ.. సరదాగా, వ్యంగ్యంగా (Satirical Movement) ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ని ప్రకటిస్తూ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించాడు.

* సీజేపీ కేవలం 56 పోస్టులే…
ఈ ఐడియా దేశంలోని కోట్ల మంది యువతకు కనెక్ట్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదు రోజుల్లోనే సీజేపీ అకౌంట్ ఊహకు అందనంత వేగంతో దూసుకెళ్లింది. సోషల్ మీడియాలో టాప్ పొజిషన్లో ఉండేందుకు బీజేపీ గత రెండేళ్లలో దాదాపు 18,000 పోస్టులు పెట్టగా.. సీజేపీ కేవలం 56 పోస్టులతోనే కోటి (10 Million+) ఫాలోవర్ల మార్కును దాటేసి సరికొత్త డిజిటల్ హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య (87 లక్షలు) కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.
* కాక్రోచ్ పార్టీ మేనిఫెస్టో ఇదే..
వ్యవస్థను నిలదీసే ‘ఐదు సూత్రాల’ వినూత్న మేనిఫెస్టో, కేవలం మీమ్స్ మాత్రమే కాకుండా, దేశంలోని పాలనా వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ ఈ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో యువతను మరింతగా ఆకట్టుకుంది. పదవీ విరమణ చేసిన చీఫ్ జస్టిస్‌లు, న్యాయమూర్తులకు వెంటనే రాజ్యసభ సీట్లు లేదా ప్రభుత్వ పదవులు ఇవ్వకూడదు. పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కనీసం 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్లలో మహిళలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి.పక్షపాత వైఖరి ప్రదర్శించే, సమాజంలో ద్వేషాన్ని నింపే ‘గోదీ మీడియా’ యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక విచారణ జరపాలి.నీట్ NEET, లీకేజీల వంటి పరీక్షల వివాదాలపై కఠినమైన చట్టాలు తీసుకురావాలి.
* ఎంపీల ఎంట్రీ.. గ్లోబల్ ట్రెండ్‌గా సీజేపీ
“బద్ధకస్తులు, నిరుద్యోగుల గొంతుక” (Voice of the Lazy & Unemployed) అనే టాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ ఉద్యమంలోకి రాజకీయ ప్రముఖులు సైతం చేరడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వంటి నేతలు తాము కూడా ఈ పార్టీలో చేరుతున్నామంటూ సరదాగా ట్వీట్లు చేయడంతో జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టి దీనిపై పడింది.
—————————-
