Minister Ponguleti Telangana Heatwave Action Plan
ఆకేరు న్యూస్ హైదరాబాద్ :
తెలంగాణను వడగాల్పులు వణికిస్తున్నాయి. ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎండ దెబ్బకు రాష్ట్రంలో 16 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణ రక్షణే పరమావధిగా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించాలని మంత్రి ఆదేశించారు.
* బాధితులకు ప్రభుత్వం అండ: రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా
రాష్ట్రంలో హీట్ వేవ్ కారణంగా సంభవించిన మరణాలపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్ల నివేదికల ప్రకారం జయశంకర్ భూపాలపల్లిలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్‌లలో ముగ్గురు చొప్పున, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 16 మంది మరణించారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటి ఆదేశాలు రానున్న మూడు రోజుల్లో వడగాల్పులు మరింత తీవ్రమౌతాయన్న ఐఎండీ (IMD) హెచ్చరికల నేపథ్యంలో మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఎండలు ఎక్కువగా ఉన్న మండలాలు, గ్రామాలను గుర్తించి మీడియా, సోషల్ మీడియా, చాటింపుల ద్వారా ప్రతి గంటకూ ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలి. ప్రతి జిల్లా కలెక్టర్ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలి. మండల స్థాయి నుంచి గ్రామ సిబ్బంది వరకు అంతా ఫీల్డ్‌లో ఉంటూ, ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలి. మనుషులతో పాటు పక్షులు, జంతువుల కోసం గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా తాగునీటి సదుపాయం కల్పించాలి.
* ఈనెల 26 వరకు డేంజర్ జోన్లోనే ఆ 10 జిల్లాలు
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈనెల 26 వరకు కింది జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పులు కొనసాగనున్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి
* ప్రజలకు కీలక సూచనలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజలు కూడా బాధ్యతగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, రోగులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దు. వ్యవసాయ, నిర్మాణ రంగా కార్మికులు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
