Godavari Water Ramchander BJP Letter to CM Revanth Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల (GODAVARI WATER) వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ బీజేపీ నేత ఎన్. రాంచందర్రావు (BJP LEADER N. RAMCHANDER RAO) ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో గోదావరి నదిపై ఉన్న వివిధ ప్రాజెక్టుల పునరుద్ధరణ, పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
* 360 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులున్నా నిర్లక్ష్యమే..
గోదావరి నదిపై దాదాపు 360 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని రాంచందర్రావు గుర్తుచేశారు. ఇంత పెద్ద మొత్తంలో నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
* కాళేశ్వరం బ్యారేజీల వల్ల 200 టీఎంసీల నష్టం…
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన బ్యారేజీల పునరుద్ధరణ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దాదాపు 200 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బ్యారేజీల మరమ్మతులు చేపట్టి, నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




* పూర్తికాని సీతారామసాగర్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులు…
కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు లభించినప్పటికీ, సీతారామసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏంటని రాంచందర్రావు ప్రశ్నించారు. అలాగే, సమ్మక్క-సారక్క (తాటిపూడి) ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును, రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలను పక్కన పెట్టి గోదావరి నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ :
MINISTER DAMODAR RAJANARSIMHA | ప్రతి జిల్లాలో కేర్ సెంటర్లు
