Vignesh Rheumatoid Arthritis Symptoms
* కీళ్ల వాతం లక్షణాలు
* కారం , మసాలాలు తగ్గించాలి
ఆకేరు న్యూస్,హనుమకొండ:
నేటి ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, రోగనిరోధక శక్తి లోపాల వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం వంటి సమస్యలు సమాజంలో విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది కీళ్ల నొప్పులు అనగానే వృద్ధాఫ్యం వల్ల వచ్చే సమస్యలుగా భావిస్తారు. అలాగే, నొప్పి రాగానే ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించడం లేదా సొంతంగా పెయిన్ కిల్లర్స్ ( Pain Killers ) వాడటం చేస్తుంటారు.
రుమటాలజీ అనేది శరీరంలోని కీళ్లు (Joints), కండరాలు (Muscles) మరియు కనెక్టివ్ టిష్యూ (Connective tissue) కి సంబంధించిన వైద్య విభాగం. ఇందులో కీళ్ల వాతం (Rheumatoid Arthritis), యూరిక్ యాసిడ్ సమస్యలు (Gout), యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing Spondylitis), సోరియాటిక్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియోపోరోసిస్ వంటి వివిధ రకాల కీళ్ల నొప్పుల సమస్యలకు చికిత్స అందించబడుతుంది.
* రుమటాలజీ& ఆర్థోపెడిక్స్ మధ్య తేడా ఏంటంటే..?
ఆర్థోపెడిక్స్ అనేది పూర్తిగా సర్జికల్ (శస్త్రచికిత్స) విభాగం. ఎముకలు విరగడం, కీళ్లు అరిగిపోయి మార్పిడి (Joint replacement) చేయడం వంటి సమస్యలను వారు చూస్తారు. కానీ రుమటాలజీ అనేది మెడికల్ సూపర్ స్పెషాలిటీ విభాగం. ఇక్కడ ఎటువంటి ఆపరేషన్లు లేకుండా, కేవలం మందుల (Medicines) ద్వారానే రోగ నిరోధక శక్తి లోపాలను సరిచేస్తూ దీర్ఘకాలిక కీళ్ల వ్యాధులకు చికిత్స చేస్తారు.
* కీళ్ల వాతం ఏ వయసు వారికి వస్తుందంటే. ?
కీళ్ల వాతానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు, ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా రావచ్చు. ఇది ఒక ఆటోఇమ్యూన్ (Autoimmune) సమస్య. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తే పొరపాటున మన స్వంత కీళ్లు మరియు కణజాలంపై దాడి చేయడం వల్ల వస్తుంది. కాబట్టి దీనికి వయసు పరిమితి లేదు.
* కీళ్ల వాతం లక్షణాలు..
దీని ప్రధాన లక్షణం ఏమిటంటే, ఉదయం నిద్ర లేవగానే కీళ్లు పూర్తిగా పట్టేయడం (Morning stiffness). కనీసం అరగంట లేదా గంట పాటు కీళ్లను కదల్చడం కష్టంగా ఉంటుంది. కొద్దిసేపు నడిచాక లేదా పనులు చేసుకున్నాక నొప్పి కొద్దిగా తగ్గుతుంది. దీనితో పాటు కీళ్ల వాపులు, తీవ్రమైన నొప్పులు ఉంటాయి. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు, కళ్లలో ఎరుపుదనం లేదా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
* ఆహార నియమాలు…
రోగులు ఎల్లప్పుడూ సమతుల్య ఆహారం (Balanced diet) తీసుకోవాలి. ఇంట్లో వండుకున్న తాజా ఆహారం చాలా మంచిది. ఉప్పు, కారం, మరియు మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. నాన్-వెజ్ వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ (Gout) సమస్య ఉన్నవారు రెడ్ మీట్, కొన్ని రకాల పప్పు ధాన్యాలను డాక్టర్ సలహా మేరకు తగ్గించాల్సి ఉంటుంది.
* మహిళల్లో ఈ సమస్య వస్తే..
కీళ్ల వాతం ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వ్యాధి పూర్తిగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని రకాల మందులు సురక్షితంగా ఉంటాయి, మరికొన్ని మందులను మార్చాల్సి వస్తుంది. డాక్టర్ పర్యవేక్షణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఎలాంటి సంతాన లేమి సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన గర్భధారణ మరియు కాన్పు సాధ్యమవుతుంది.
* ప్రత్యామ్నాయ పద్ధతులు…
ప్రధాన వైద్యంతో పాటు నాచురోపతి విధానాలు మరియు మంచి డైట్ పాటించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ యోగా మరియు మెడిటేషన్ చేయడం వల్ల కీళ్ల కదలికలు మెరుగవడమే కాకుండా రోగులలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాధి వల్ల వచ్చే డిప్రెషన్ లేదా ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి యోగా చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అయితే, డాక్టర్ సూచించిన ప్రధాన మందులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు.
* నిర్లక్ష్యం చేస్తే నష్టం జరుగుతుంది
– డాక్టర్ విఘ్నేష్ , MD,DM ( Rheumatology )
Apex Hospital, Hanumakonda
లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా నిపుణుడైన రుమటాలజిస్ట్ను సంప్రదించాలి. చాలా మంది నొప్పి తగ్గడానికి సొంతంగా పెయిన్ కిల్లర్స్ (Pain killers) వాడుతుంటారు, దీనివల్ల కిడ్నీలు మరియు లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రారంభ దశలోనే సరైన మందులు (ఉదాహరణకు మెథోట్రెక్సేట్, క్లోరోక్విన్ వంటివి) వాడితే కీళ్లు శాశ్వతంగా పాడైపోకుండా, ఆపరేషన్ల వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
————————————-
