KTR Congress Indiramma Housing
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘డబుల్ బెడ్రూమ్ వర్సెస్ ఇందిరమ్మ ఇళ్ల’ వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణలో పేదలకు ఆత్మగౌరవ ఇళ్లు కట్టించింది మేమైతే.. వాటిని కూల్చుతోంది మీరు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
* సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్కు అలవాటే..
మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ నాయకుల శపధాలపై ఘాటుగా స్పందించారు. అధికారంలోకి రాకముందు, వచ్చాక సవాళ్లు విసరడం, ఆ తర్వాత వాటిని నెరవేర్చలేక పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. “20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పారు. మరి ఇప్పుడు ఆ మాట మీద నిలబడగలరా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం మైకుల ముందు శపథాలు చేయడం కాదు.. చేతనైతే క్షేత్రస్థాయిలో ఇళ్లు నిర్మించి చూపించాలని డిమాండ్ చేశారు.
* మా ఒక్క ఇల్లు.. మీ 7 ఇళ్లతో సమానం…
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతను, వైశాల్యాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
“బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం సకల సౌకర్యాలతో ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. మేము కట్టించిన ఒక్కో గృహం.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. నాణ్యతలో గానీ, సౌకర్యాలలో గానీ మా ఇళ్లకు సాటిరాగలరా?” అని ప్రశ్నించారు.
* పేదల ఇళ్లను కూలుస్తున్నారు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, పేదలకు అందించిన ఇళ్లను, ఆస్తులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల సాకులతో కూల్చివేస్తోందని మండిపడ్డారు. పేదలకు గూడు కల్పించాల్సింది పోయి, ఉన్న గూటిని లాగేసుకోవడం దుర్మార్గమన్నారు. ఆత్మగౌరవ ఇళ్లు కట్టిన చరిత్ర, క్రెడిట్ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
