Andhra Pradesh Textile Hub
* విశాఖలో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, డెస్క్: భారత కేంద్ర జౌళి శాఖ (టెక్స్టైల్స్) మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నంలో విస్తృతంగా పర్యటించారు. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలను సందర్శించిన ఆయన, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
* ఏపీ మెడ్‌టెక్ జోన్ (AMTZ) సందర్శన….
తన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి మొదటగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ‘ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్’ (AMTZ)ను సందర్శించారు. అక్కడ అత్యాధునిక వైద్య పరికరాల తయారీ ప్రక్రియను, పరిశోధనలను ఆయన పరిశీలించారు.
అనంతరం AMTZ ఉన్నతాధికారులు, ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెడ్‌టెక్ జోన్ సాధిస్తున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను అధికారులు మంత్రికి వివరించారు. దేశీయంగా వైద్య పరికరాల రంగాన్ని బలోపేతం చేయడంలో ఏపీ మెడ్‌టెక్ జోన్ పాత్ర అభినందనీయమని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కొనియాడారు.
* బ్రాండిక్స్‌లో కార్మికులతో ముఖాముఖి…
అనంతరం అచ్యుతాపురం సెజ్ (SEZ)లోని ప్రముఖ దుస్తుల తయారీ పరిశ్రమ ‘బ్రాండిక్స్’ (Brandix) అపారెల్ సిటీని కేంద్రమంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తుల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమలో పని చేస్తున్న మహిళా కార్మికులతో గిరిరాజ్‌సింగ్ నేరుగా ముచ్చటించారు.
వారి పనితీరు, వేతనాలు, కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వేలాది మంది మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్న బ్రాండిక్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
* టెక్స్టైల్ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత…
ఈ సందర్భంగా కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో టెక్స్టైల్ రంగం పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.
“భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ (జౌళి) రంగమే. భవిష్యత్తు అంతా టెక్నికల్ టెక్స్టైల్స్దే. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో టెక్నికల్ టెక్స్టైల్స్ అభివృద్ధి కోసం ఒక ‘ప్రత్యేక పార్క్’ (Special Technical Textile Park) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరాను” అని మంత్రి వెల్లడించారు.
* మోదీ, చంద్రబాబుల లక్ష్యం అదే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి టెక్స్టైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, వారి ఆర్థిక ఎదుగుదలే దేశ ప్రగతికి మూలమని స్పష్టం చేశారు. “మహిళా సాధికారతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ముఖ్య లక్ష్యం” అని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
