KTR Reacts on Pawan Kalyan Telangana
* రాజకీయాల నుంచి తప్పుకుంటా..
* కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ పలు కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు.
* మాకు దేశభక్తి నేర్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కు లేదు..
పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదంపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఎక్కడైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేసిన ఆయన.. పోటీ చేసే ప్రాంత పరిస్థితులు, అక్కడి పోరాటాల చరిత్రను ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు.
“తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమిపుత్రుల జాగీరే. నాడు మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.. దాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం కంటే ఉగ్రవాదం ప్రమాదకరమంటూ పవన్ మాట్లాడటం సరికాదు. మాకు దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ నేర్పాల్సిన అవసరం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మేం పూర్తి మద్దతు ఇచ్చాం” అని కేటీఆర్ గుర్తుచేశారు.
* శృతి, లయ లేని కాంగ్రెస్ క్యాబినెట్.. అప్పులపై ఒక్కో మంత్రిది ఒక్కో లెక్క..
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రుల మధ్య కనీస సమన్వయం లేదని, ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పు రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమే… కాంగ్రెస్ మంత్రుల ప్రచారం రూ. 10 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసింది.
“భూముల వేలంలో ఎకరం రూ. 200 కోట్లకు పోతుందని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా.. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఎటు మళ్లిస్తున్నారు?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
* సవాల్ విసురుతున్నా.. రాజకీయం నుండి తప్పుకుంటా!
కేసీఆర్ హయాంలో తెలంగాణలో అమోఘమైన ఆర్థిక విప్లవం వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు.
“గడిచిన పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతి కంటే.. దేశంలోని మరే ఇతర రాష్ట్రమైనా ఎక్కువ ప్రగతి సాధించిందని నిరూపిస్తే, నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా” అని సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ.. “సీఎం పదేపదే తాను అందరినీ తొక్కుకుంటూ వచ్చానని అంటుంటారు. ఆయన వేరే వాళ్లను తొక్కారో లేదో తెలియదు కానీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మాత్రం నిజంగానే తొక్కేశారు” అని మండిపడ్డారు.
* కాంగ్రెస్ ‘ఫస్ట్ హాఫ్’ డిజాస్టర్!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మార్క్ పాలనను ‘ఫస్ట్ హాఫ్ డిజాస్టర్’ గా అభివర్ణించారు.
ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని నాడు నమ్మబలికారని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రగతిని కుంటుపరిచారని ఆరోపించారు. “3 నెలల్లో పిల్లలు పుడతారా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “సరే, ఇప్పుడు 30 నెలలు (రెండున్నరేళ్లు) దాటిపోతోంది..
మరి ఇప్పటికీ హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని ఏమనాలి?” అంటూ కేటీఆర్ నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో ఏ రంగం చూసినా పూర్తిగా డౌన్ అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read :-
