BJP leader RAO PADMA KAKATIYA UNIVERSITY
* కాకతీయ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
– బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి
* గ్రేటర్ ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యమని పిలుపు..
* కేయూ నిధులు, భూముల అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు
ఆకేరు న్యూస్, హనుమకొండ:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ నాగేంద్రనగర్లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆడెపు రాజు అధ్యక్షతన డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
* కేయూ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రావు పద్మ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, విద్యార్థులను రెచ్చగొడుతున్నాయంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా ద్వారా చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
* కేయూకు నిధుల కేటాయింపులో వివక్ష – బీజేపీ
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తర తెలంగాణ విద్యా నిలయమైన కాకతీయ యూనివర్సిటీకి కేవలం రూ.50 కోట్ల కేటాయింపును మాత్రమే ప్రకటించడం వివక్షకు నిదర్శనమని ఆరోపించారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కోసం వచ్చే కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో స్కూల్ నిర్మిస్తామని ప్రకటించడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోందని విమర్శించారు.
* బోధనా సిబ్బంది కొరతపై ఆందోళన
కాకతీయ యూనివర్సిటీలో 400 మంది టీచింగ్ స్టాఫ్ అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 75 మంది మాత్రమే పర్మినెంట్ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. పలు విభాగాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు.
* పొలిటికల్ సైన్స్ – పర్మినెంట్ స్టాఫ్: 0
* తెలుగు – పర్మినెంట్ స్టాఫ్: 0
* హిస్టరీ – పర్మినెంట్ స్టాఫ్: 1
* పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – పర్మినెంట్ స్టాఫ్: 1
* కామర్స్ – అవసరం 40, ఉన్నది 6 మంది
* ఎకనామిక్స్ – అవసరం 28, ఉన్నది 1 మాత్రమే
అలాగే 22 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కేయూ ఇంజనీరింగ్ కళాశాల, 16 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మహిళా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇప్పటికీ ఒక్క పర్మినెంట్ టీచింగ్ స్టాఫ్ కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
* కేయూ భూముల అంశంపై ప్రశ్నలు
ఒకప్పుడు 650 ఎకరాలు ఉన్న కాకతీయ యూనివర్సిటీ భూమి ప్రస్తుతం 600 ఎకరాలకు పరిమితమైందని, సుమారు 50 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఆరోపించారు. భూముల రక్షణ కోసం అధికారులు సర్వే నిర్వహించి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచినా, వాటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే పాత్రపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రావు పద్మ రెడ్డి వ్యాఖ్యానించారు.
* విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతుంది
కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని రావు పద్మ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో డివిజన్ ఇన్చార్జి, పరకాల కౌన్సిలర్ విజయ్, బీజేపీ నాయకులు పవన్, రాజు, శక్తికేంద్రాల ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
