Free Medical Health Camp
* న్యూ లైఫ్ లైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
* ప్రారంభించిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
* ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని పిలుపు
ఆకేరు న్యూస్, తొర్రుర్ : న్యూ లైఫ్ లైన్ ఆసుప్రతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ శిబిరంలో వందలాది మంది రోగులకు న్యూ లైఫ్ లైన్ ఆసుప్రతి నిపుణులైన వైద్యులు ఉచితంగా బీ పి, షుగర్,వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం బాధితులకు అవసరమైన మందులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. సమాజంలో పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చిన న్యూ లైఫ్ లైన్ ఆస్పత్రి యాజమాన్యాన్ని, వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, జీవనశైలి కారణంగా అనేక రకాల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు.
ముఖ్యంగా దోమల నివారణ, కాచి చల్లార్చిన నీటిని తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్( జనరల్ ఫిజీషియన్) ఆస్పత్రి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
