Telangana Youth Killed in USA
* సోదరి కన్నీరు
ఆకేరు న్యూస్, డెస్క్: ఉపాధి కోసం, ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు, యువతపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియా నగరంలో తెలంగాణకు చెందిన 28 ఏళ్ల కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘోర కలికానికి సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
* ఉద్యోగం చేస్తూ.. వీకెండ్స్‌లో పార్ట్-టైమ్ డెలివరీ..
హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు అన్షుల్ (28). ఉన్నత చదువుల (MBA) కోసం 2023లో అమెరికా వెళ్ళిన అన్షుల్, చదువు పూర్తిచేసి ప్రస్తుతం అక్కడ ఒక బహుళజాతి సంస్థ (MNC)లో డేటా ఎక్స్‌పర్ట్‌గా ఉద్యోగం సాధించాడు. అయితే, అదనపు ఆదాయం కోసం వీకెండ్స్‌లో (వారాంతాల్లో) ‘పీట్స్ పిజ్జా’ (Pete’s Pizza) అనే షాపులో పార్ట్ టైమ్‌గా పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
* ఫేక్ ఆర్డర్.. పథకం ప్రకారం మాటు వేసి హత్య…
అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో నార్త్ ఫిలడెల్ఫియాలోని ‘రేమండ్ రోసెన్ హోమ్స్’ హౌసింగ్ కాంప్లెక్స్ నుంచి మూడు పిజ్జాల ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన లొకేషన్‌కు అన్షుల్ తన కారులో వెళ్లాడు. అయితే అది పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఒక ఖాళీ అపార్ట్మెంట్ (Vacant Property).
అన్షుల్ పిజ్జా బాక్సులను లోపల పెట్టి తిరిగి వస్తుండగా, నల్లటి దుస్తులు ధరించి, మాస్కులు పెట్టుకున్న ఇద్దరు దుండగులు అతనిని వెంబడించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో అన్షుల్ తల వెనుక భాగంలో వరుసగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తూటాలు తలలోకి దూసుకుపోవడంతో అన్షుల్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో కేవలం కొన్ని ఇంచుల దూరంలోనే మూడు బుల్లెట్ షెల్స్ లభ్యమవడం చూస్తే.. హంతకులు ఎంత దగ్గరగా నిలబడి కాల్చారో అర్థమవుతోంది.
* ఇది దోపిడీ కాదు.. కేవలం చంపడానికే ‘ట్రాప్’…
సాధారణంగా అమెరికాలో ఇలాంటి దాడులు నగదు, మొబైల్ ఫోన్ల దోపిడీ కోసం జరుగుతుంటాయి. గతంలో కూడా అన్షుల్‌పై ఒకసారి దోపిడీ దొంగలు దాడి చేసి అతని గోల్డ్ చైన్, ఫోన్, వాలెట్ లాక్కున్నారు. కానీ ఈసారి దుండగులు అన్షుల్ వద్ద ఉన్న నగదును గానీ, కారును గానీ ముట్టుకోలేదు. చివరికి అపార్ట్మెంట్లో ఉంచిన పిజ్జా బాక్సులు కూడా అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి ఇది దోపిడీ కోసం జరిగిన దాడి కాదని, కేవలం అన్షుల్‌ను చంపడానికే పక్కా పథకం ప్రకారం ‘ఫేక్ ఆర్డర్’ ఇచ్చి ఉచ్చు (Trap) లోకి లాగారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
* “దయచేసి మీ పిల్లల్ని అమెరికా పంపకండి” – సోదరి తన్వి కన్నీటి అభ్యర్థన..
ఈ ఘోర ఉదంతంపై అన్షుల్ సోదరి తన్వి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “మా తమ్ముడికి అసలు అమెరికా వెళ్లడమే ఇష్టం లేదు, మేమే బలవంతం చేసి పంపించాం. ఇప్పుడు వాడు చీకటి వీధిలో శవమై పడి ఉన్నాడు. నా తమ్ముడిని చంపడానికి పక్కాగా స్కెచ్ వేశారు. నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి మరీ ఘోరంగా కాల్చి చంపారు. వాడిని చంపడం వల్ల ఆ దుండగులకు ఏం లాభమో మాకు తెలియడం లేదు. దయచేసి తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను అమెరికా పంపకండి” అంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత అనుమానాలు లేవని, కానీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
* హంతకుల సమాచారం ఇస్తే $20,000 డాలర్ల రివార్డు..
ఈ కేసును ఫిలడెల్ఫియా పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానిక హౌసింగ్ అథారిటీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. బ్యాగ్‌లు తగిలించుకున్న ఇద్దరు అనుమానితులు అన్షుల్‌ను వెంబడించినట్లు గుర్తించారు. అలాగే ఏ ఫోన్ నంబర్ నుండి అయితే ఫేక్ పిజ్జా ఆర్డర్ వచ్చిందో ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందించిన వారికి 20,000 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 16.5 లక్షలకు పైగా) బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
* భారత రాయబార కార్యాలయం (Consulate) స్పందన…
ఈ ఘోర ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా (X) అన్షుల్ కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ కేసు విషయమై అమెరికా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాధితుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించేందుకు (Repatriation) అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. సోమవారం నాటికి మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ పూర్తవుతుందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
