CM Revanth Reddy Indira Mahila Shakti Sabha
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి మహాసభ’ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం, మహిళా సాధికారతలో భాగంగా మహిళలే స్వయంగా కొనుగోలు చేసిన 550 ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
* మహిళల హక్కులకు కాంగ్రెసే కేరాఫ్….
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. “అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పట్టింది. కానీ, భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే మహిళలకు సమానంగా ఓటు హక్కు కల్పించిన ఘనత పండిట్ జవహర్లాల్ నెహ్రూదే” అని కొనియాడారు.
దేశానికి ‘ఉక్కు మహిళ’గా ఇందిరాగాంధీ అఖండ కీర్తి సంపాదించారని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై నుంచి చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో వీరనారీమణులు పోరాటాలు చేశారని సీఎం కొనియాడారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని, తొలి మహిళా ప్రధానమంత్రిని, పలువురు మహిళా ముఖ్యమంత్రులను చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు.
* బీజేపీ, బీఆర్ఎస్లపై ఘాటు విమర్శలు…
రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యతపై ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న బీజేపీ.. ఇంతవరకు ఒక్క మహిళనైనా పార్టీ జాతీయ అధ్యక్షురాలిని చేసిందా?” అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మహిళలకు కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. గడిచిన పదేళ్ల కాలంలో మహిళలను పార్టీ అధ్యక్షురాలిని చేయకపోగా.. తొలి ఐదేళ్ల పాటు కేబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని చరిత్ర బీఆర్ఎస్దని ధ్వజమెత్తారు.
* మహిళా మంత్రులతో కాంగ్రెస్ సరికొత్త ప్రస్థానం…
తాము అధికారంలోకి రాగానే మహిళలకు సముచిత స్థానం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖ వంటి బలమైన మహిళా నేతలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించుకున్నామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, రవాణా రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ 550 బస్సుల కొనుగోలు మహిళా శక్తికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
