India W vs Pakistan W T20 WorldCup 2026
* భారత్-పాక్ హై వోల్టేజ్ ఫైట్ నేడు..
ఆకేరు న్యూస్, డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్-2026లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరు నేడు ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి ఎన్నో ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు ముగింపు పలికిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. ఇప్పటివరకు ఐదు సార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ చేరిన భారత్ ఇంకా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
* భారత్‌కు ఫామ్ ఆందోళన
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నా.. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై టీ20 సిరీస్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ప్రపంచకప్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో కూడా రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలవడం అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు భారత్‌కు ప్రధాన బలంగా ఉన్నారు.
* పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం
టీ20 క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు జరగగా.. భారత్ 13 విజయాలు సాధించింది. పాకిస్థాన్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
టీ20 ప్రపంచకప్‌ల్లో కూడా భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ప్రపంచకప్ వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారత్ ఆరు విజయాలు నమోదు చేసింది. అయితే పాకిస్థాన్ సాధించిన మూడు విజయాల్లో రెండూ ప్రపంచకప్ల్లోనే రావడం విశేషం.
* పాక్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ కూడా ఈ ఏడాది టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించింది. అయినప్పటికీ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒత్తిడి, ఉత్కంఠ ఎప్పుడూ ప్రత్యేకమే.
భారత్ విజయంతో టోర్నీని ఆరంభించాలనుకుంటుండగా.. మరోవైపు ప్రపంచకప్ వేదికపై మరోసారి సంచలనం సృష్టించాలని పాకిస్థాన్ భావిస్తోంది.
దీంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేటి భారత్-పాక్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ విందుగా మారనుంది.
* జట్లు
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్ తదితరులు.
పాకిస్థాన్: ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ, గుల్ ఫెరోజా, సిద్రా అమీన్, నష్రా సందు, డయానా బేగ్ తదితరులు.
