Telangana Coal Crisis
ఆకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, ప్రస్తుతం అత్యంత తక్కువ బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. కేంద్ర విద్యుత్ మండలి (CEA) తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు సంక్షోభాన్ని స్పష్టం చేసింది. అయితే, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సింగరేణి సంస్థ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
* 24 శాతానికే పరిమితమైన నిల్వలు..
కేంద్ర విద్యుత్ మండలి (సీఈసీ) నివేదిక ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి తెలంగాణ జెన్కో (TS Genco) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం 25.54 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ, ప్రస్తుతం కేవలం 24 శాతం అంటే 6.09 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. గత ఐదేళ్ల కాలంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. గతేడాది సింగరేణి మొత్తం ఉత్పత్తి కేవలం 58 మిలియన్ టన్నులకు పరిమితమైందని నివేదిక పేర్కొంది.
* యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో నిలిచిన ఉత్పత్తి..
ఈ బొగ్గు కొరత ప్రభావం కొత్తగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై తీవ్రంగా పడింది. రోజువారీ అవసరం 43,700 టన్నులు. ఈ నెల 13న వచ్చింది కేవలం 13,500 టన్నులు మాత్రమే. ప్రస్తుత బొగ్గు ఉత్పత్తి అందకపోవడంతో ప్లాంట్‌లో కేవలం 21% విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.
నిబంధనల ప్రకారం యాదాద్రి ప్లాంట్‌లో 11.32 లక్షల టన్నుల కనీస (బఫర్) బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ అక్కడ కేవలం 18 శాతం (2,03,760 టన్నులు) మాత్రమే నిల్వలు ఉన్నాయి.
* వివరాలు దాచేస్తున్న సింగరేణి..
దేశంలోని అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమ రోజువారీ, నెలవారీ ఉత్పత్తి వివరాలను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచాలనే నిబంధన ఉంది. అయితే, ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకు పడిపోవడంతో, సంస్థ ప్రతిష్ట దెబ్బతినకుండా చూసేందుకు ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సింగరేణి తన అధికారిక వెబ్సైట్ నుంచి బొగ్గు ఉత్పత్తి వివరాలను తొలగించినట్లు తెలుస్తోంది.
* సీఈసీ సీరియస్ హెచ్చరికలు..
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే తెలంగాణ జెన్కో కేంద్రాలకు బొగ్గు సరఫరాను తక్షణమే పెంచాలని సింగరేణి సంస్థను కేంద్ర విద్యుత్ మండలి (CEA) ఆదేశించింది. రాబోయే రోజుల్లో బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే రాష్ట్రంలో కరెంట్ కోతలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
