Vahan Sarathi Server Down Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ (RTO) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా శాఖకు సంబంధించిన ప్రధాన సాఫ్ట్వేర్లు ‘వాహన’, ‘సారథి’ సర్వర్లు సాంకేతిక లోపంతో ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (RTO Offices) సేవలు పూర్తిగా స్థంభించిపోయాయి.
* ఎక్కడికక్కడే నిలిచిన సేవలు..
సర్వర్ల వైఫల్యం కారణంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, లెర్నింగ్ లైసెన్స్ (LLR) స్లాట్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఎన్ఓసీ (NOC) వంటి కీలక సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం ముందస్తు స్లాట్లు బుక్ చేసుకుని కార్యాలయాలకు చేరుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు కాకపోవడంతో ఆర్టీవో ఆఫీసుల వద్ద భారీగా క్యూలైన్లు లైన్లు వెలిశాయి.
* అధికారులు ఏమంటున్నారంటే..
సాఫ్ట్వేర్ నిలిచిపోవడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి లోపాన్ని సరిచేసే పనిలో పడ్డారని తెలిపారు. సర్వర్లు పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి కనీసం గంట సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సేవలు పునరుద్ధరించిన తర్వాతే పనులు యథావిధిగా సాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు.
