Uppal Pre Primary School inauguration
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో భాగంగా, ఎంపీపీఎస్-ఉప్పల్ పరిధిలోని ప్రీ-ప్రైమరీ పాఠశాలను సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ విద్యను పటిష్టం చేస్తోందని అన్నారు. తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె కోరారు.ఒకే ప్రాంగణంలో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అందుబాటులో ఉండటం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించాలని జెడ్పీహెచ్ఎస్ బాలుర ప్రధానోపాధ్యాయురాలు ఎం. నిర్మల అన్నారు. పాఠశాల సముదాయాల ప్రధానోపాధ్యాయురాలు వీ. వాణి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య అనేది దేశ నిర్మాణంలో ఎంతో కీలకమైన భూమిక పోషిస్తుందని అన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని సర్పంచ్ ఎం. రమ – నాగరాజు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు డీ. రాజిరెడ్డి , స్థానిక వార్డు మెంబరు వెంగళ ప్రియాంక, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
* ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాల నియామకం ఆలస్యం
ఒకవైపు ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నప్పటికీ ,ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా ఎంపిక ప్రక్రియ పట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, కొన్నిచోట్ల ఇంటర్ మార్కులు, ఇంకొన్ని చోట్ల డీఈడీ, బీఈడీ, ప్రీ ప్రైమరీ కోర్స్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతాం అని అధికారులు చెబుతుండటంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. ఏది ఏమైనా విద్యాశాఖ సూచించిన విధంగా ఇన్స్ట్రక్టర్, ఆయాల ఎంపిక పూర్తి చేసి, ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు వనరులు సమకూర్చి పూర్తిస్థాయిలో పాఠశాలలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
