CM Vijay Tamil Thai Vazhthu Resolution
* తమిళనాడు రాష్ట్ర గీతమే ముందుగా ఆలపిస్తాం
* తమిళ్ తాయ్ వాళ్తు పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
* తమిళం భాష మాత్రమే కాదు.. మా ఆత్మ
– సీఎం విజయ్
ఆకేరు న్యూస్, చైన్నై : తమిళనాడులో జరిగే అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ముందు ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను తప్పనిసరిగా ఆలపిస్తాం.. ఇదే సంప్రదాయాన్ని ఇక నుంచి పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.తమిళనాడులోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రజా సంస్థలు నిర్వహించే కార్యక్రమాల ప్రారంభానికి ముందు ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను తప్పనిసరిగా ఆలపించాల్సి ఉంటుంది.
* తమిళనాడు రాష్ట్ర గీతమే ముందు..
మనోన్మణియం సుందరనార్ రచించిన ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను 1970 నవంబర్ 23 నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపిస్తున్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి దీని ఆలాపనను తప్పనిసరి చేశారు. 2021 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం ‘తమిళ్ తాయ్ వాళ్తు’కు అధికారికంగా తమిళనాడు రాష్ట్ర గీతం హోదాను కల్పించింది. 2026 జూలై 9న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలకు ప్రతిస్పందనగా తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ముందుగా ‘వందేమాతరం’, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. దీనివల్ల తమిళనాడు రాష్ట్ర గీతం మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటన మళ్లీ జరగనివ్వబోమని టీవీకే ప్రభుత్వం స్పష్టం చేసింది.
* తమిళం భాష మాత్రమే కాదు.. ఆత్మ
అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మా ఆత్మ, ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. ‘తమిళ్ తాయ్ వాళ్తు’ తమిళ భాషా అస్తిత్వానికి ప్రతీక కాబట్టి, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో దానినే ముందుగా ఆలపించాలని అన్నారు. ‘తమిళ్ తాయ్ వాళ్తు’కు దక్కాల్సిన గౌరవం విషయంలో టీవీకే ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడబోదని స్పష్టం చేశారు.రాష్ట్ర గీతాలకు సముచిత గుర్తింపు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో అవసరమైన సవరణలు చేయాలని కోరుతూ 2026 మే 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ముందుగా ఆలపించేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరినట్లు చెప్పారు. ఈ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. అనంతరం తమిళనాడు శాసనసభ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
* వందేమాతరం సరి కొత్త వివాదం
సాధారణంగా చూస్తే ఇది పెద్ద రాజకీయ సమస్యగా కనిపించదు. తమిళనాడులో ఇప్పుడు ఇదే ప్రశ్న కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తి, భాషా–సాంస్కృతిక గుర్తింపు వరకు వెళ్లింది.కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’కు ప్రాధాన్యం కల్పించే ప్రోటోకాల్ నేపథ్యంలో, దశాబ్దాలుగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో వినిపిస్తున్న తమిళ్ తాయ్ వాళ్తు స్థానం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానంగానే తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర గీతం ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ అసెంబ్లీ తీర్మానం తీసుకొచ్చింది..
* అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఇప్పటి వరకు జనగణమన ను జాతీయ గీతం( National Anthem), వందేమాతరం -జాతీయ గేయం – ( National Song ) , తమిళ్ తాయ్ వాళ్తు — రాష్ట్ర గీతం ( Tamil Nadu State Song) గా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ 2026 జూలై 9న వందేమాతరం ఆలాపనకు సంబంధించిన ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభంలో వందేమాతరం, కార్యక్రమం ముగింపులో జాతీయ గీతం ఉండే విధానం అమలైతే, ఇప్పటికే ప్రారంభ గీతంగా ఉన్న తమిళ్ తాయ్ వాళ్తు స్థానం ఏమిటన్నది తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక్కడే ఒక చిన్న ప్రోటోకాల్ సమస్య రాజకీయంగా పెద్ద ఫెడరల్ ప్రశ్నగా మారింది. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం తమిళ్ తాయ్ వాళ్తుతో ప్రారంభమవుతున్నప్పుడు, కేంద్రం రూపొందించే ఒక దేశవ్యాప్త ప్రోటోకాల్ కారణంగా రాష్ట్ర గీతం రెండో లేదా మూడో స్థానానికి వెళ్లాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం తన రాష్ట్ర సంస్థల్లో తమిళ్ తాయ్ వాళ్తుకు ఉన్న ప్రాధాన్యాన్ని కాపాడాలని నిర్ణయించింది.
* ఇతర రాష్ట్రాలు కూడా అడిగితే..?
భారతదేశంలో అనేక రాష్ట్రాలకు తమ భాష, సంస్కృతి, ప్రాంతీయ చరిత్రను ప్రతిబింబించే అధికారిక, సంప్రదాయ రాష్ట్ర గీతాలు ఉన్నాయి. కేంద్ర ప్రోటోకాల్ రాష్ట్రాల అధికారిక సాంస్కృతిక కార్యక్రమాల క్రమాన్ని మార్చగలదనే సూత్రం స్థిరపడితే, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ప్రశ్న రావచ్చు. అందుకే తమిళనాడు వివాదాన్ని ఒక రాష్ట్రం ఒక పాట సమస్యగా కాకుండా భారత సమాఖ్య వ్యవస్థలో సాంస్కృతిక స్వయంప్రతిపత్తి ఎంతవరకు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే సమస్య పాటలో లేదు.. ప్రాధాన్య క్రమంలో ఉంది. వందేమాతరాన్ని పాడాలా వద్దా అన్నది వివాదం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తును దాని దశాబ్దాల నాటి మొదటి స్థానం నుంచి తప్పించాలా అన్నదే అసలైన సమస్య అని తమిళ మేధావులు అంటున్నారు.. జాతీయ గుర్తింపు, ప్రాంతీయ గుర్తింపు రెండింటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం భారత సమాఖ్య వ్యవస్థకు లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఒకేసారి భారతీయుడూ కావచ్చు, తమిళుడూ కావచ్చు. తెలుగువాడు కావచ్చు ఇతర ఏ రాష్ట్రానికి సంబందించిన వాడైన కావచ్చు.. జాతీయ గీతాన్ని గౌరవిస్తూనే తమ రాష్ట్ర గీతాన్ని గౌరవించవచ్చని చెబతున్నారు..
—————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
