Dead Rat in Curd
ఆకేరు న్యూస్, వరంగల్: ప్రముఖ డైరీ సంస్థల ప్యాకింగ్ నమ్మకత్వంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నిత్యం మనం నమ్మి కొనే ఆహార పదార్థాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారో కళ్లకు కట్టే ఘటన వరంగల్‌లో వెలుగుచూసింది. లీటర్లు, అరలీటర్ల ప్యాకెట్లలో వచ్చే పాలు, పెరుగును గుడ్డిగా నమ్మి వాడుకునే వినియోగదారులకు ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట (SRR Thota) ప్రాంతంలో ఒక ప్రముఖ కంపెనీ పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
* ప్యాకెట్‌ను కట్ చేయగా…
ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఒక కిరాణా షాపులో ఒక స్థానిక వినియోగదారుడు ‘సంగం’ (Sangam Dairy) బ్రాండ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి, వంట గదిలో ఆ ప్యాకెట్‌ను కట్ చేయగా.. అందులో నుంచి వచ్చిన దృశ్యాన్ని చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. పెరుగుతో పాటు అందులో కుళ్ళిన స్థితిలో ఉన్న ఒక చిన్న ఎలుక పిల్ల బయటపడింది. నిత్యం బ్రాండెడ్ ఉత్పత్తులను నమ్ముకునే తమకు ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో సదరు వినియోగదారుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
* కిరాణా షాపు వద్ద వాగ్వాదం..
వెంటనే ఆ పెరుగు ప్యాకెట్‌ను తీసుకుని కొనుగోలు చేసిన కిరాణా దుకాణానికి వెళ్లిన బాధితుడు, యజమానిని నిలదీశాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెరుగు ప్యాకెట్లో ఎలుక వచ్చిన విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో స్థానికులు పెద్ద ఎత్తున దుకాణం వద్దకు చేరుకున్నారు. బాధితుడు వెంటనే ఈ విషయాన్ని ఆహార భద్రతా విభాగం (Food Safety Officers) అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
* రంగంలోకి దిగిన అధికారులు.. అమ్మకాలు బంద్…
ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన అధికారులు సదరు కిరాణా షాపును సందర్శించి తనిఖీలు చేపట్టారు. పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల ఉన్న విషయాన్ని ప్రాథమికంగా ధృవీకరించుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఆ నిర్దిష్ట బ్యాచ్‌కి (Batch) సంబంధించిన సంగం పాల, పెరుగు ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణంలోని సరుకును సీజ్ చేసి, తదుపరి ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
కంపెనీల ప్యాకింగ్ కేంద్రాలలో పరిశుభ్రత లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, సదరు డైరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
