Warangal Anti Drugs Campaign
ఆకేరు న్యూస్, వరంగల్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించేందుకు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, విద్యార్థులు సైనికుల్లా ముందుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ‘ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని’ పురస్కరించుకుని బుధవారం సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్‌లో భారీ ‘2కే రన్’ (2K Run) నిర్వహించారు.
ఈ పరుగును వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద సీపీ సన్‌ప్రీత్ సింగ్, స్థానిక శాసనసభ్యులు, కలెక్టర్లు, కుడా చైర్మన్‌తో కలిసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ట్రైసిటీ పరిధిలోని వందలాది మంది యువతీ యువకులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ రన్.. కమిషనరేట్ కార్యాలయం నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు కొనసాగింది. అనంతరం పరుగులో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికేట్లను అందజేశారు.

* మత్తు పదార్థాలతో జీవితాలు అంధకారం…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ మహమ్మారి ఒక పెద్ద సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. “యువత, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల ఉచ్చులో పడకూడదు. ఒక్కసారి వీటికి బానిసలైతే జీవితాలు పూర్తిగా అంధకారమయమవుతాయి. మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. విద్యార్థులు కేవలం చదువులపైనే దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాల సాధనకై కృషి చేయాలి.” అని సీపీ హితవు పలికారు.
* అవగాహనతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం- ఎమ్మెల్యే నాయిని…
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటమే కాకుండా, ఇతరుల్లోనూ చైతన్యం నింపాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.
* రంగంలోకి ‘ఈగల్ ఫోర్స్’..
వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణకై పోలీస్ శాఖ ప్రత్యేకంగా “ఈగల్ ఫోర్స్” విభాగాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సమాజంలో ఎవరైనా మాదకద్రవ్యాలను విక్రయించినా, లేదా వినియోగిస్తున్నట్లు తెలిసినా తక్షణమే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
* తల్లుల వేదన వర్ణనాతీతం- హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి…
హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత మత్తుకు బానిసలై జీవితాలను రోడ్డున పడేసుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడిన వారి కుటుంబాలు, ముఖ్యంగా కన్న తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని, ఆ బాధను గుర్తించి యువత సరైన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

* “ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్” – యువత ప్రతిజ్ఞ
కార్యక్రమం ముగింపులో పాల్గొన్న యువత, విద్యార్థులందరితో “మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సైనికుడిలా పోరాడుతాం” అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులంతా డ్రగ్స్ నిర్మూలనకు మద్దతుగా ఏర్పాటు చేసిన “ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్” (I’m Anti-Drugs Soldier) సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగి యువతలో సరికొత్త స్ఫూర్తిని నింపారు.
* హాజరైన ప్రముఖులు…
ఈ భారీ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, TG NPDCL మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్యశారద, చాహత్ బాజ్‌పాయి, కుడా (KUDA) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యతో పాటు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

