KUNAMNENI CPI PROTEST HANAMKONDA
* హనుమకొండలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన
* ఉద్రిక్తతల మద్య ఎమ్మెల్యే కూనంనేని సహా వామపక్ష నేతల అరెస్టు
* విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పేదల ఇళ్ళ పోరాటం కొనసాగిస్తాం
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అకేరు న్యూస్ హనుమకొండ : పేదల ఇళ్ళ కూల్చివేతపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పేదల గుడిసెలను ప్రభుత్వం కక్ష గట్టి ఇళ్ళ కూల్చివేతకు పాల్పడటంపై శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల వామపక్షాల ఆధ్వర్యంలో వేలాదిమందితో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఏకశిలా పార్కు వద్ద ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎంసిపిఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తదితర రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రదర్శన ఏకశిలా పార్కు నుండి కాళోజీ సెంటర్ మీదుగా సుబేదారి అమరవీరుల స్థూపం వరకు చేరుకున్నది. అనంతరం అమర వీరుల స్థూపం జంక్షన్ లో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు,వేలాదిగా తరలి వచ్చిన పేదలు బైఠాయించారు.

* ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి
తమకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వామపక్ష కార్యకర్తలు, పేదల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ క్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహా వామపక్ష రాష్ట్ర, జిల్లా నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు.
కూనంనేని సాంబశివరావు, ఇతర నాయకుల అరెస్టులను వామపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, వామపక్ష పార్టీల కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. అరెస్టులను నిరసిస్తూ పోలీసుల వాహనాలను అడ్డుకోవడంతో పాటు అరెస్టులకు నిరసనగా ప్రధాన రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

* వరంగల్ నుంచే పోరాటం – కూనంనేని సాంబశివరావు
పేదల ఇళ్ళ స్థలాల సాధన పోరాటం పోరాటాల గడ్డ అయిన వరంగల్ నుండే ప్రారంభిస్తున్నామని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం దిగి వచ్చే వరకూ కొనసాగుతుందని అన్నారు. కమ్యూనిస్టులు నిరంతర పేదల పక్షానే నిలబడుతారని, విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పేదల ఇళ్ళ స్థలాల సాధన పోరాట కొనసాగిస్తామని హెచ్చరించారు.
అధికారులు, ప్రభుత్వం పేదల పై కక్ష కట్టడం మానుకోవాలని, పెద్ద పెద్ద భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దృష్టి సారించాలని సూచించారు.
హనుమకొండలోని గుండ్ల సింగారంలో, గోపాల్ పూర్ లో ప్రభుత్వ భూమి దేనికి ఉపయోగ పడుతుందని పేదల ఇళ్ళు కూల్చి వేశారని ప్రశ్నించారు. కూల్చివేతలను అధికారులపై నెట్టి వేయడం సరికాదని, అధికారులు కూల్చి వేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పేదలకు న్యాయం జరిగే వరకు ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమై అండగా ఉంటాయని, ప్రభుత్వం తక్షణమే గుడిసె వాసులందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నీ వామపక్షాలు కలిసి ఒకే జెండాగా ముందుకు సాగి ఇళ్ళ పట్టాలు సాధించే వరకు విశ్రమించేది లేదని అన్నారు.

* కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నా
జూలై 1న హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ ల ముందు పికెటింగ్ నిర్వహించి, జూలై 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ధర్నా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పిస్తామని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గుడిసెలు కూల్చివేసిన ప్రాంతంలోనే తిరిగి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు నివాస స్థలాలు లేక, కిరాయిలు కట్టలేక ప్రభుత్వ భూములలో 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుంటే కూల్చి వేయడం సరికాదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
మొన్న ఖమ్మంలో, నేడు వరంగల్ లో గుడిసెలు కూల్చివేసిన ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే ఈ ప్రభుత్వాన్నే పేదలు కూల్చి వేస్తారని హెచ్చరించారు. పేదల కోసం తాము ఎంతకైనా తెగించి పోరాడుతామని, తీవ్రమైన పోరాటాలకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడగా సిపిఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, షేక్ బాష్ మియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేశ్, ఆదరి శ్రీనివాస్, తోట బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు దండు లక్ష్మణ్, మద్దెల ఎల్లేష్, సిపిఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు జి. ప్రభాకర్ రెడ్డి, సిహెచ్ రంగయ్య, నాయకులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సింగారపు బాబు, వీరన్న, ఎం సీపీఐ(యూ) జిల్లా కార్యదర్శులు ఎన్ రెడ్డి హంసారెడ్డి, పెద్దారపు రమేష్, మాలోతు సాగర్, గడ్డం నాగార్జున, న్యూడెమక్రసి జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు. కొత్తపల్లి రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

1 thought on “MLA KUNAMNENI – CPI PROTEST | వేలాదిమందితో భారీ నిరసన”