MLA KADIYAM SRIHARI, STATION GHANPUR
* నెల రోజుల్లో నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
రూ. 300 కోట్లతో నియోజకవర్గంలోని విద్యా సంస్థల బలుపేతానికి కృషి చేస్తున్నామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటేశ్వర్ల పల్లి, తీగల తండా, రాజవరం కస్తూరిభా గాంధీ పాఠశాలలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటేశ్వర్లపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేసి 10 లక్షల సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. తీగల తండాలో 7 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంబొత్సవం చేసి 10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రాంభించారు. అనంతరం రాజవరంలోని కస్తూరిభా గాంధీ పాఠశాలలో 1 కోటి 92 లక్షల 55 వేల రూపాయలతో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చిల్పూర్ మండలానికి చెందిన 35 మందికి 11 లక్షల 34 వేల రూపాయల విలువగల ఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన చిల్పూర్, వేలేరు మండలాలలో కేజీబీవి పాఠశాలలను మంజూరు చేయించానని తెలిపారు. 2023 లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేజీబీవి పాఠశాలలను సందర్శించి సమస్యలను గుర్తించి నియోజకవర్గం పరిధిలోని కేజీబీవిలు, మోడల్ స్కూల్లలో మౌలిక వసతుల కల్పనకు రెండు విడతలలో 18 కోట్ల 98 లక్షలు మంజూరు చేసానని వెల్లడించారు.
నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలో నియోజకవర్గంలోని కేజీబీవిలు, మోడల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు దాదాపు 300 కోట్ల నిధులను వెచ్చించినట్లు తెలిపారు. నెల రోజులలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాబోతుందని ప్రకటించారు.
విద్యాలయాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా హబ్ గా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే దేశంలోనే ఎక్కడా లేని విధంగా 200 కోట్లతో నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు.
గతంలో నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా 10వ తరగతి ఫలితాలలో ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. చేసే పని పట్ల నిబద్దత ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని స్పష్టం చేశారు.
విద్యార్థుల పట్ల ప్రతేక శ్రద్ద వహిస్తూ స్వంత బిడ్డలుగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని కష్టపడి చదవాలని అన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక లక్ష్యం అని, అందుకు ఉపాధ్యాయులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులదని, సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డివో కిరణ్ ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచులు రేణుక వీరాస్వామి, తీగల సాంబరాజు, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపిడివో కృష్ణ ప్రసాద్, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వివిధ గ్రామాల సర్పంచులు, శాత బోయిన రాజు, మోటం రాజు, నవీన్, వెంకటేశ్వర్లు మండల నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, విద్యార్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
