Telangana Tourism Development Plans
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పర్యాటక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCR HRD) లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
* అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీ అడవులు…
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలన్నారు. నగరంలో గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే మరిన్ని ఎకో పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
* దుర్గం చెరువు, తారామతి బారాదరికి సరికొత్త హంగులు
నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చాలని సీఎం చెప్పారు. తారామతి బారాదరిని ఆధునీకరించడంతో పాటు, దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే చారిత్రక మంజీరా, దిల్కుషా అతిథి గృహాలను (గెస్ట్ హౌస్‌లను) పునరుద్ధరించాలని ఆదేశించారు.
* వికారాబాద్ టెంపుల్ టూరిజం డెవలప్మెంట్
టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేయాలని, దీని కోసం ప్రత్యేక పాలక మండలిని (బోర్డు) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూర్ (CURE) పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహా ఎకో టూరిజం ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలన్నారు.
* వారసత్వ కట్టడాల పరిరక్షణ.. పురానాపూల్ బ్రిడ్జి పునరుద్ధరణ
హైదరాబాద్ నగర సంస్కృతికి అద్దం పట్టే పురానాపూల్ వంటి చారిత్రక బ్రిడ్జిలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఈ బ్రిడ్జిల అభివృద్ధి అనంతరం అవసరమైతే అక్కడి ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించి, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
* డిసెంబర్లో ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’
రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వచ్చే డిసెంబర్ నెలలో ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సమ్మిట్ విజయవంతం కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
