Station Ghanpur Temple Development
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని జీడికల్, నవాబ్ పేట, చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, మల్లికుదుర్ల ఆలయాల అభివృద్ధి పై కమిషనర్ హనుమంత రావుతో కలిసి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్లు, ఈఈ, ఈవో లతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.
* ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..
గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆర్.జే.సి ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ మాస్టర్ ప్లాన్ లో భక్తుల అవసరలకు అనుగుణంగా అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. దేవాలయాల భూముల ఆక్రమణలు తొలగించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నెల రోజులలో ఆలయాల అభివృద్ధికి సంబందించిన పూర్తి స్థాయి సమగ్ర నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు.
* జీడికల్ – శ్రీ సీత రామచంద్ర స్వామి దేవస్థానం
లింగాల గణపురం మండలం జీడికల్ దేవస్థానం ఆవరణలో పచ్చదనం కోసం మొక్కల పెంపకం చేపట్టాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న గర్భాలయం, ప్రాకారాలను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే జాతర నాటికి కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలని అలాగే ఆఫీస్ కార్యాలయం, మీటింగ్ హల్ తో పాటు 10 రూములతో కూడిన జీ+1 గెస్ట్ హౌస్ నిర్మాణం చేయాలని తెలిపారు. ఆలయ భూమిలో ఉన్న ప్రయివేట్ వ్యక్తుల ఇళ్లకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించాలని, ఆలయ పూజారి నివాసం కోసం వసతి గృహాన్ని పునర్ నిర్మించాలని అన్నారు. జీడికల్ ఆలయ అభివృద్ధికి 5 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు.
* నవాబ్ పేట – శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం
నవాబ్ పేట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కల్యాణ మండపం అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. నవాబ్ పేట ఆలయ అభివృద్ధికి 3 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు.
* చిల్పూర్ – బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం
వెంకటేశ్వర్ల పల్లి నుండి చిల్పూర్ దేవస్థానం వరకు రోడ్డు వెడల్పు చేయాలని అలాగే గుట్ట ప్రాంతంలోని 1 కిలోమీటర్ వరకు రెండు వైపులా డ్రైనేజి నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈశన్యంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, కల్యాణ మండపం అభివృద్ధి, పాకశాల, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, కాటేజెస్, ఈవో కార్యాలయం, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అలాగే గుట్ట ముందు భాగంలో ఉన్న ఆక్రమనలను తొలగించాలని సూచించారు. చిల్పూర్ ఆలయ అభివృద్ధికి 10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు.
* శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం
అక్రమణలకు గురై దేవస్థాన భూమిలో ఉన్న ఇళ్లను, షాపులను తొలగించాలని అన్నారు. ఆలయంలో ఉన్న కోనేరు అభివృద్ధి చేయాలని తెలిపారు. జాతీయ రహదారి కోసం ఇచ్చిన భూమికి సంబందించిన నష్ట పరిహారం ఆర్డివో వద్ద పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని వెంటనే ఆలయానికి అందించాలని దేవాలయానికి సంబందించిన ఆభరణాలకు పంచనామా నిర్వహించి ఆలయానికి అప్పగించాలాని సూచించారు. ఆలయ అభివృద్ధికి 2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు.
* మల్లికుదుర్ల – గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం
సిజీఎఫ్ నిధుల ద్వారా మంజూరు అయిన పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అలాగే భక్తుల విరాళాలతో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, ఆలయ కమిటీ చైర్మన్లు, పొట్లపల్లి శ్రీధర్ రావు, నీల నర్సింహులు, ఏలే మూర్తి, ఈఈలు, ఈవోలు, ఇతర దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
