Minister Seethakka Mulugu Development
* జిల్లాలో త్వరలో పర్యటించనున్న సీఎం
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* యూరియా సరఫరా పై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి
* మేడారం మాస్టర్ ప్లాన్ పై దృష్టి ప్రత్యేక దృష్టిసారించాలి
-రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్,ములుగు:
మేడారం ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుత వర్షాకాల సీజన్ లో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో కొనసాగుతున్న పెండింగ్ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం ఆలయ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ఐడీఓసీ పనుల పురోగతి, రామచంద్రపురం భూసర్వే, పైలాన్ నిర్మాణం, వర్షాల పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన సన్నాహక చర్యలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ములుగు జిల్లాలో పర్యటించే సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కన గట్టమ్మ దేవాలయం సమీపంలో పంచాయతీరాజ్ రోడ్డు పనులకు భూమిపూజ, నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, కరకట్టల నిర్మాణం తదితర కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని,జిల్లాలో చేపట్టిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ఒకే శిలాఫలకంపై పొందుపరిచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో భూసేకరణ, రహదారుల విస్తరణ, క్యూ లైన్ల పునర్వ్యవస్థీకరణ, అతిథి గృహం, ఆసుపత్రి, కాటేజీలు, పార్కింగ్, పారిశుధ్య సదుపాయాలు, జంపన్న వాగు పరిసరాల అభివృద్ధి తదితర అంశాలతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామచంద్రపురం పరిధిలోని 10,600 ఎకరాల భూముల రీసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని, పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రామప్ప–లక్నవరం పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు, రైతులకు యూరియా కొరత లేకుండా తగిన నిల్వలు, సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వరదల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని,వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చెయ్యాలని, అటవీశాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉంచి విస్తృతంగా మొక్కల నాటకం చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పరిపాలన, పోలీసు, ఎండోమెంట్స్, పారిశుధ్య, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
