Telangana SIR Voter Revision
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ శరవేగంగా దూసుకుపోతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ, సేకరణను ముమ్మరం చేశారు.
తాజా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను, ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 3,06,21,142 ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 90.52 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది.
* వెనుకబడిన ఐటీ కారిడార్….
ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ముందంజలో నిలిచి 100 శాతం ఫారాల పంపిణీని పూర్తి చేశాయి. అయితే, రాజధాని పరిసర ప్రాంతాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పంపిణీ మరియు డిజిటైజేషన్ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగుతోంది. హైదరాబాద్లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా, అక్కడ 71.14 శాతం మాత్రమే ఫారాలు పంపిణీ అయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లకు గాను 87.35 శాతం పంపిణీ పూర్తయింది.
* డిజిటైజేషన్లో యాదాద్రి భువనగిరి ఫస్ట్..
మరోవైపు సేకరించిన ఫారాలను ఆన్లైన్ చేసే (డిజిటైజేషన్) ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 26,38,708 ఫారాల డిజిటైజేషన్ పూర్తయింది. ఇది మొత్తం ఫారాలలో 7.80 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 34.88 శాతంతో అత్యధిక డిజిటైజేషన్ పూర్తి చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో కుమురం భీమ్ ఆసిఫాబాద్ (27.91%), నల్గొండ (23.44%), ఖమ్మం (20.90%) జిల్లాలు ఉన్నాయి.
అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 1.08 శాతం మాత్రమే కావడం గమనార్హం. రంగారెడ్డిలో 2.48 శాతం, వికారాబాద్లో 2.67 శాతం చొప్పున మాత్రమే డిజిటైజేషన్ నమోదైంది. నగర పరిధిలో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, జూలై 24 లోగా ఫారాల సేకరణ పూర్తి చేసి, జూలై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా (Draft Roll) సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఓటర్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో వివరాలు సమర్పించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
