Jangaon Bus Theft Incident
ఆకేరు న్యూస్, జనగామ: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని జనగామ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ఒక బస్సును అర్ధరాత్రి పూట అపహరించి, దాదాపు 21 కిలోమీటర్లు నడిపి టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురిచేసిన ఘటన గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది.
పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన గిట్టబోయిన వెంకన్న అనే వ్యక్తి డోజర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంలో గొడవల కారణంగా బుధవారం నాడు అతను జనగామకు వచ్చాడు. అదే సమయంలో, గంట గోపికృష్ణారెడ్డి అనే యజమానికి చెందిన రూ. 20 లక్షల విలువైన బస్సు జనగామ ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడుస్తోంది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ బస్సు డ్రైవర్ తన ట్రిప్ ముగించుకుని, బస్సును లాక్ చేసి తాళాలను యజమానికి అప్పగించారు.
* మద్యం మత్తులో బస్సుతో ఉడాయింపు…
గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పూర్తి మద్యం మత్తులో ఉన్న వెంకన్న, బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఆ బస్సును స్టార్ట్ చేసుకుని సూర్యాపేట వైపు వేగంగా దూసుకెళ్లాడు. మద్యం మత్తుతో పాటు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపాడు.
* టోల్గేట్ వద్ద ప్రమాదం.. దొరికిపోయిన నిందితుడు:
జనగామ నుంచి దాదాపు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి అక్కడి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. బస్సు ప్రవర్తనను, డ్రైవింగ్ స్టైల్‌ను గమనించిన టోల్గేట్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వారు బస్సు వద్దకు వెళ్లి చూడగా వెంకన్న తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే టోల్గేట్ నిర్వాహకులు దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను బస్సును దొంగిలించుకొచ్చినట్లు తేలింది. అనంతరం నిందితుడిని, బస్సును జనగామ పోలీసులకు అప్పగించారు. బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
