Andhra Woman Death Scam
* రూ. 1400 కోట్ల స్కామ్..
ఆకేరు న్యూస్, డెస్క్: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి మరణం వెనుక రూ. 1,400 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యోద్యమమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
* కేసులో అనూహ్యమైన మలుపులు…
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె అట్లూరి ప్రసన్న ఉన్నత చదువులు, ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె మరణవార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే, ప్రసన్న మరణించిన కొద్ది రోజులకే ఈ కేసులో అనూహ్యమైన మలుపులు (ట్విస్టులు) వెలుగులోకి వచ్చాయి.
* రూ. 1,400 కోట్ల స్కాంతో లింకులు..
ప్రసన్న మృతి కేవలం ఒక ప్రమాదం కాకపోవచ్చని, దీని వెనుక ఒక భారీ మల్టీ-స్టేట్ ఫ్రాడ్ (ఆర్థిక మోసం) దాగి ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “షేక్ బజార్ కిసాన్ పరివార్” అనే సంస్థకు, ప్రసన్నకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
రైతుల పేరుతో భారీ మోసం… భూపాల్ నాయక్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి “షేక్ బజార్ కిసాన్ పరివార్” అనే సంస్థను స్థాపించాడు. అధిక వడ్డీలు, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ దాదాపు రూ. 1,400 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసారు. కంపెనీ డైరెక్టర్‌గా ప్రసన్న ఈ సంస్థకు సంబంధించిన కీలకమైన అధికారిక ఒప్పంద పత్రాలు (Agreement Papers), లీగల్ డాక్యుమెంట్లలో అట్లూరి ప్రసన్న ‘డైరెక్టర్’ హోదాలో సంతకాలు చేసినట్లు గుర్తించారు.
* రంగంలోకి గుజరాత్ పోలీసులు.. తెరపైకి మరిన్ని అనుమానాలు
ఈ రూ. 1,400 కోట్ల స్కాంపై ఇప్పటికే గుజరాత్లో భారీ ఎత్తున కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు ప్రధాన నిందితుడైన భూపాల్ నాయక్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
భూపాల్ నాయక్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలోనే.. అమెరికాలో డైరెక్టర్‌గా ఉన్న ప్రసన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
* సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నమా…
ఈ భారీ స్కాంలో అసలు నిజాలు, సూత్రధారులు బయటకు రాకుండా ఉండేందుకు ప్రసన్నను లైన్ క్లియర్ చేశారా?
ప్రమాదం వెనుక ఉన్నదెవరు? అమెరికాలో జరిగిన ప్రమాదం వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి.
ఈ కేసు ఇప్పుడు ఏపీ, గుజరాత్ పోలీసులతో పాటు అంతర్జాతీయ దర్యాప్తు పరిధిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సాధారణ గ్రామీణ నేపథ్యం ఉన్న యువతి అంతటి పెద్ద స్కాంలో డైరెక్టర్‌గా ఎలా మారింది? ఆమెను ఎవరైనా బలవంతంగా ఇరికించారా? లేదా ఆమెకు తెలియకుండానే సంతకాలు తీసుకున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
