Urea Booking New Rules
ఆకేరు న్యూస్, వరంగల్: రైతులకు యూరియాను మరింత సులభంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ లో సాంకేతిక ఇబ్బందులు, కఠిన నిబంధనల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకుని ఒకరి పేరిట ఉన్న కోటాను మరొకరికి బదిలీ చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, యాప్లో కీలక మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
* మూడు విడతల్లో యూరియా పంపిణీ…
భూమి విస్తీర్ణాన్ని బట్టి యూరియా బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. 2 ఎకరాల లోపు ఉన్నవారు తమ పంటలకు సరిపోయే యూరియాను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు (గతంలో ఇది కేవలం ఒక ఎకరా లోపు వారికే ఉండేది).
2 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నవారు, రెండు విడతలుగా యూరియాను బుక్ చేసుకోవచ్చు.
5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు, మూడు విడతలుగా తమ కోటాను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు యూరియా బుకింగ్ల మధ్య కనీసం 20 రోజుల వ్యవధి ఉండేలా సరికొత్త మార్పులు చేశారు.
* ఓటీపీ (OTP) కి గుడ్ బై.. ఇక నేరుగా బుకింగ్..
గతంలో యాప్లో లాగిన్ కావాలంటే ప్రతిసారీ మొబైల్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ (OTP) కోసం వేచి చూడాల్సి వచ్చేది. నెట్వర్క్ సమస్యల వల్ల చాలామంది రైతులకు ఓటీపీలు రాక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ, అధికారులు యాప్ను అప్డేట్ చేశారు. ఇకపై ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండానే నేరుగా యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
* వర్షాలు లేక మందగించిన ఎరువుల వినియోగం….
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వివిధ రకాల పంటలు సుమారు 15.85 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, దాదాపు 60,250 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు కాస్త మందగించాయి. దీనివల్ల ప్రస్తుతం ఎరువుల వినియోగం ఇంకా ఊపందుకోలేదు.
ప్రభుత్వం యాప్లో తీసుకువచ్చిన ఈ సరికొత్త మార్పులను రైతులందరూ గమనించి, సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) వి. విజయ్చంద్ర సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
