Kazipet Anglo Indian History
* స్వదేశీ.. విదేశీ సంస్కృతుల సమ్మిళితం
ఆకేరు న్యూస్.. అరుదైన కథనం..
కాజీపేట జంక్షన్.. భారతీయ రైల్వేలో ఎంత కీలకమైనదో.. సంస్కృతీ సంప్రదాయాల్లో అంత విభిన్నమైన చరిత్ర కలది. తెలంగాణ మొత్తంగా.. ఆ మాటకొస్తే దేశంలోనే ప్రత్యేకమైనది. స్వదేశీ.. విదేశీ సంస్కృతుల సమ్మిళితం ఈ పట్టణం. నాడు అత్యధిక సంఖ్యలో ఆంగ్లో ఇండియన్లకు నిలయం. బ్రిటీష్ కాలంలోనే కాదు.. ఇప్పటికీ ఇక్కడ ఆంగ్లో ఇండియన్ల సంస్కృతి సజీవంగా ఉందని అంటున్నారు నాటి తరానికి చెందిన నేటి వారసులు. నాడు మినీ లండన్ లా, మినీ ఇంగ్లాండ్ లా ఉంటూనే.. నేడు తెలంగాణతో కలిసిపోయిందని చెబుతున్నారు. ఆంగ్లో ఇండియన్ల సంస్కృతీ సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నప్పటికీ అవర్ ఇండియా.. డై ఫర్ ఇండియా.. అని సగర్వంగా చెబుతున్నారు. కాజీపేట జంక్షన్‌కు, ఆంగ్లో-ఇండియన్ల చరిత్రకు ఉన్న విడదీయరాని బంధంపై “ఆకేరు న్యూస్ అరుదైన కథనం”..
* ఖాజీపేట.. ఓ మినీ లండన్.. 80 శాతం ఆంగ్లో ఇండియన్లే..!
నేటి ఖాజీపేట జంక్షన్ ఒకప్పుడు మినీ లండన్ లా, మినీ ఇంగ్లాండ్ లా ఉండేది. ఎందుకంటే దాదాపు 80 శాతం ఆంగ్లో ఇండియన్లు, తమిళులులే ఉండేవారట. అప్పటి సంస్కృతి పూర్తిగా భిన్నంగా ఉండేది. వాళ్లతో కలిసేందుకు, మాట్లాడేందుకు తెలుగు వారు చాలా ఆసక్తి చూపేవారట. ఆంగ్లో ఇండియన్లు మాతో ఉంటే మా ఇమేజ్ పెరుగుతుందనే భావన ఉండేదట. ఇదే విషయమై ఖాజీపేటలోనే ఉంటున్న జోసెఫ్ ఆల్బర్ట్ (తల్లిదండ్రులు ఆంగ్లో ఇండియన్లు) మాట్లాడుతూ “క్రమశిక్షణ, భక్తి, డ్రెస్సింగ్ విధానం.. వంటివి ఎన్నో వాళ్ల నుంచి నేర్చుకున్నాం. వాటిని ఈరోజు కూడా మేం కొనసాగిస్తూనే ఉన్నాం. చర్చిలో వాళ్లు ప్రార్థనలు ఆంగ్లంలో చెప్తూ ఉంటే మేం విని నేర్చుకునే వాళ్ళం. చాలా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసేవారు. ఈరోజు కూడా మేము అదే మా పిల్లలకు నేర్పిస్తున్నాం”.. అని వివరించారు. “డేవిడ్ కుక్ సర్ లాంటి వాళ్లు ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఏడో లేదా ఎనిమిదో తరం వాళ్లు నేర్పిన పాటలే పాడుతున్నారు మా చర్చిలో. క్రిస్మస్ ట్రీ, నక్షత్రాలు, క్రిబ్ (గుడిసె) వాటి తయారీని తమకు చూపించేవాళ్లు. నేర్పించే వాళ్లు. వాళ్లకు స్వార్థం అనేది ఉండేది కాదు.” అని జోసెఫ్ చెబుతుండడం నాటి ఆంగ్లో ఇండియన్ల ప్రత్యేకతను తెలియజేస్తోంది.
* ఆ బంధం తెగిపోలేదు.. అది ఇప్పటికీ కొనసాగుతోంది..
ఆంగ్లో ఇండియన్లు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం అందరూ వెళ్ళిపోయారు. వారిలో ఎక్కువ మంది మెట్టుగూడ, లాలాగుడ, సౌత్ లాలాగూడలో స్థిరపడ్డారు. ఇంకా ఒక ఫ్యామిలీ ఉందంటే తాము ఇంకా ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నామని జోసెఫ్ ఆల్బర్ట్ తెలిపారు. “స్నేహితుడు రెంజో. వాళ్ళది నార్సిస్. వాళ్ళ కుటుంబం ఎంత స్నేహపూర్వకంగా ఉండేది అంటే, వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ అంటే ఐదు నుంచి ఆరు రోజుల వరకు వేడుకలు ఉండేవన్నమాట. వాళ్ళ తల్లిదండ్రుల రజతోత్సవం ఇక్కడే జరిగింది. తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళ వివాహ స్వర్ణోత్సవానికి నేను హాజరయ్యాను. మా ఇంట్లో ఏమైనా శుభకార్యాలకు పిలిస్తే వాళ్లు వస్తారు.. కాబట్టి ఆ బంధం తెగిపోలేదు.. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి అదే వాళ్ళు మనకు నేర్పించారు. ఆల్ సోల్స్ డే.. పెద్దలకు గౌరవాన్ని సమర్పించడం వంటివి వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాము. ఎక్కువ మంది ఆంగ్లో-ఇండియన్లు, విక్టర్ పాల్ లాంటి కొందరు తమిళ ప్రజలు కూడా ఉండేవారు. మాకు డోర్నకల్ ప్రజలతో కూడా సంబంధాలు ఉండేవి. వారంతా సంగీత విధ్వాంసులు.” అని వారితో ఉన్న బంధాన్ని చెప్పుకొచ్చారు జోసెఫ్ ఆల్బర్ట్.
* ఇండియాలో ఖాజీపేటే.. అంతా ఒక కుటుంబంలా..
దేశంలో కేవలం ఖాజీపేటలోనే ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా ఉండేవారని నాటి తరానికి చెందిన నేటి వారసులు చెబుతున్నారు. దాదాపు ఐదు తరాలుగా ఇక్కడ నివశిస్తున్నారు. ఒకప్పుడు ఏకంగా 95 శాతం మంది ఆంగ్లో ఇండియన్లే ఉండేవారంటే అతిశయోక్తి కాదని ఇప్పటికీ ఇక్కడే ఉంటున్న గ్యారీ థాయ్ (తండ్రి ఆంగ్లో ఇండియన్) “ఆకేరు న్యూస్” కు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “ఇక్కడ ఇండియన్లు, బ్రిటీష్ సంతతికి చెందిన వాళ్లం చాలా ఐకమత్యంగా ఉండేవాళ్లం. ఇక్కడ అందరూ మా ఇటాలియన్ ప్రజలను కలుపుకున్నారు. హిందూ, ముస్లిం, బ్రాహ్మణ అనే తేడా లేకుండా అందరం మైగ్రేట్ అయ్యాం. మాకు కేవలం మంచి తిండి, నీట్ గా ఉండడం, ఈరోజుకు హాయిగా గడపడం.. అంతే తెలుసు. రేపటి నుంచి ఆలోచన ఉండేది కాదు. ఇక్కడి ఇండియన్లను చూసే జాగ్రత్త నేర్చుకున్నాను. సొంత ఇల్లు కొనుక్కున్నాను.” అని వెల్లడించారు.
* గణేశ్ పండగకు హిందువుల ఇళ్లకు బ్రిటీషర్లు
క్రిస్మస్ పండుగకు ఇండియన్లను వాళ్లు ఆహ్వానిస్తే.. దసరా, గణేశ్ చవితి తదితర పండుగలకు బ్రిటీషనర్లను ఆహ్వానించేవారట. “అవును.. దసరా, గణేశ్ పండగకు మేం వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్లం. క్రిస్మస్ కు వాళ్లు మా ఇంటికి వచ్చేవారు. అంత క్లోజ్ ఉండేవాళ్లం. పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు బేధాలు ఉండేవి కావు. ఉదాహరణకు దసరా సమయంలో రావణసురుడి తయారీలో రామ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లిక సహకరించేవాళ్లం. ఎంత హ్యాపీ అంటే ఆ లైఫ్ చాలా సూపర్. ఇండియన్ ఫ్రెండ్స్ కు మేం ఇంగ్లిషు నేర్పించేవాళ్లం. వాళ్లు మాకు తెలుగు నేర్పించేవాళ్లు. నేను అలాగే నేర్చుకున్నా. క్రిస్మస్ పండగ వస్తోందంటే బ్రిటీష్ సంతతికి చెందిన ఇళ్ల నుంచి వచ్చే అద్భుతం. ఆ స్మెల్ ఇప్పటికీ మరచిపోలేం”.. అని వివరించారు గ్యారీ థాయ్.
* లేడీస్.. జెంట్స్ కలిసి డ్యాన్స్.. స్టైలిష్ డ్రెస్సింగ్..
ప్రస్తుత ఖాజీపేట జంక్షన్ ఆ కాలంలో మినీ లండన్ లా ఉండేది. ఎందుకు అలా అంటే.. లేడీస్, జెంట్స్ కలిసి డ్యాన్సింగ్ చేయడం, స్టైలిష్ డ్రెస్సింగ్ తో తిరిగేవారు. చిన్న క్యాంటిన్ లో అందరూ కలిసి మ్యూజిక్ పెట్టుకుని నాన్ స్టాప్ డ్యాన్స్ చేసే వాళ్లం. ఇంగ్లిష్ ఈజ్ మోస్ట్ రిక్వైర్డ్ లాంగ్వేజ్. ఉద్యోగానికి, ఎక్కడైనా బతకానికి ఇంగ్లిష్ పనికొస్తదని మా ఫ్రెండ్స్ కు కూడా నేర్పేవాళ్లం. మీ వల్లే నేర్చుకున్నంరా భాయ్ అంటుంటారు. పెళ్లిళ్ల కేక్ చాలా ఫేమస్. ఆంగ్లో ఇండియన్స్ మ్యారేజెస్ కు చాలా మంది కేక్ కోసం వచ్చేవారు. ఎందుకంటే అది చాలా ఢిపెరెంట్ గా ఉంటాది. అంటూ గ్యారీ థాయ్ వెల్లడించారు.
* ఆంగ్లో ఇండియన్స్ లో డౌరీ సిస్టం లేదు.. ఎక్కువగా లవ్ మ్యారేజీలే..
ఆంగ్లో ఇండియన్లలో అరెంజ్డ్ మ్యారేజెస్ చాలా తక్కువగా జరిగేవట. ఎక్కువగా లవ్ మ్యారేజ్ లే. పిల్లలకు ఫ్రీడం ఇచ్చేది. వాళ్ల లైఫ్ పార్ట్నర్ వాళ్లే సెలక్ట్ చేసుకునే వాళ్లు. “డాడీ.. ఫలానా అబ్బాయిని లవ్ చేశానంటే.. మోస్ట్ లీ ఒకే చేసేవాళ్లు” అని గ్యారీ పేర్కొన్నారు. “మరో విశేషం ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ లో డౌరీ సిస్టం లేదు. ఫంక్షన్ ఒకటే ఉంటాది. పెళ్లిలో ఫేమస్ ఏమిటంటే వెడ్డింగ్ బ్యాండ్ ఒకటే. నో డిజైన్.. నో షేప్.. ఓన్లీ రౌండ్ గా ఉంటాది. బికాజ్ ఇటీజ్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ లవ్.” అని ఆకేరు న్యూస్ ప్రతినిధికి తన చేతికున్న వేలు చూపించారు గ్యారీ థాయ్.
ఆ జమానా ఎట్లుండేదిరా బాయ్.. ఇప్పుడు ఎట్లా ఉన్నది..
“ఆ జామానా ఎట్లుండేదిరా బాయ్.. ఇప్పుడు ఎట్లా ఉన్నది. గంటకు 15 పైసలకు సైకిల్ అద్దెకి తీసుకుని తిరుగుతుంటే సంతోషం ఉండేది. రానురాను ఆంగ్లో ఇండియన్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రిటైర్ కావడం, వారి దేశాలకు వెళ్లడం, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. నాకు ఒక్కటే బాధ. ప్రస్తుతం నాలుగైదు కుటుంబాలు మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం కలియుగం అంటున్నారు.. అయినా హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, ఫ్రెండ్షిప్ మరచిపోకూడదు. నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆల్బర్ట్, నవీన్, నాగరాజు కు ఫోన్ చేస్తా. ఉన్నంత వరకు కలిసి మెలిసి బతకాలి. కలర్.. క్యాష్ డిఫరెన్సెస్ ఉండొద్దు. లివ్ లైఫ్ హ్యపీ లీడ్. అని గ్యారీ థాయ్ నేటి తరానికి సూచిస్తున్నారు. అవర్ ఇండియా.. డై ఫర్ ఇండియా..” అని పేర్కొన్నారు.
* 30 సంవత్సరాల క్రితం ఖాజీపేటలో..
“ఆంగ్లో ఇండియన్స్ వృత్తి రీత్యా ఇక్కడకు వచ్చారు. రైల్వే లో పనిచేస్తూ ఇక్కడకు ట్రాన్సఫర్ అయ్యారు. 30 సంవత్సరాల క్రితం ఖాజీపేటలోని దేవాలయాల్లో మా ఆంగ్లో ఇండియన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఆంగ్లో ఇండియన్ కథోలికులకు, ఇప్పటి ఆంగ్లో ఇండియన్ కథోలికులకు చాలా తేడా ఉంది. దేవుని పని కోసం కూడా ఇప్పుడున్న వారి వెంట పడాల్సి వస్తోంది. ఆ రోజుల్లో గురువును కూర్చోబెట్టి వాళ్లే పనులన్నీ చేసేవారు. ఆర్థిక సహకారాన్ని కూడా అందించేవారు. కేథలిక్ సంఘాలు ఎదగాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంత ప్రజలు కూడా క్రీస్తుపై విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆంగ్లో ఇండియన్లు. ఫాతిమానగర్, ఖాజీపేట, జనగాం, కరీంనగర్ ఇలా చాలా ప్రాంతాల్లో ఇటలీ దేశస్థులు మత వ్యాప్తికి కృషి చేశారు. స్థలాలు కొని చర్చిలు కట్టించారు. ఆంగ్లో ఇండియన్లు కూడా..” అంటూ ఆంగ్లో ఇండియన్స్ వచ్చే చర్చి ఫాదర్ ఎం. జయపాల్ వివరించారు.
* ఇండియన్ల బిడ్డల చదువుకు బ్రిటీషర్ల సహకారం
బ్రిటీష్ వాళ్లు మన స్వేచ్ఛను హరించారని, వ్యాపారం కోసం వచ్చి మనల్ని చిత్రహింసలు పెట్టారని మాత్రమే తెలుసు. అయితే ఖాజీపేటకు వచ్చి స్థిరపడిన బ్రిటీషర్లలో కొందరు పేదరికంలో ఉన్న భారతీయులను సహకారం అందించేవారని ఆంగ్లో ఇండియన్లు పేర్కొంటున్నారు. ఇదే విషయమై ఎం. దేవదాస్ (ఆంగ్లో ఇండియన్ యువతిని వివాహమాడారు) మాట్లాడుతూ “పేదవాళ్లు, బడుగు బలహీన వర్గాల వారి చదువుకు బ్రిటీష్ వాళ్లు సహకరించేవారు. పేదవాడిని, తండ్రి లేని నన్ను కూడా వాళ్లే చదివించారు. కేవలం ధనవంతులకే పరిమితమైన కేబ్రల్ స్కూల్ లో చదివించారు. క్రీస్తు గురించి కూడా ప్రార్థనలు నేర్పించేవారు. చదువు పూర్తయ్యాక నా ప్రవర్తన చూసి ఆ చర్చిలో ఉండే ఆంగ్లో ఇండియన్ (మా మామగారు), అత్తగారు తమిళన్, నాకు వాళ్ల పిల్లనిచ్చి 84లో మ్యారేజ్ చేశారు. అప్పుడే జాతి, కులం, మతం చూసేవారు కాదు. మా బ్రదరిల్లాస్ కూడా బ్రిటీష్ వాళ్లనే చేసుకున్నారు. ఆట, పాటల్లో కూడా వాళ్లు బేధం చూపేవారు కాదు. రైల్వే ఇన్స్టిట్యూట్ (ఇప్పుడూ ఉంది)లో క్యారమ్ తదితర ఆటును వారి దగ్గరే చూసి నేర్చుకున్నాం. నేను ఖాజీపేటలో ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్లతో సమానంగా నన్ను చూశారు. ఇక్కడి సంస్కృతిలో తప్పకుండా వాళ్ల ముద్ర ఉంది. వాళ్లు పని మనుషులతోనే అన్ని పనులూ చేయించుకంటారు అనుకుంటారు. నేను స్వయంగా చూసింది ఏంటంటే వాళ్ల పనులను వాళ్లే చేసుకుంటారు. పని మనుషులే చేయాలి అనే బేధం ఉండేది కాదు.” అన్నారు.
* పార్క్ నగర్ అభివృద్ధిలో ఆంగ్లో ఇండియన్ల ముద్ర
ఆనాడు ఆంగ్లో ఇండియన్లు ఇక్కడి వారితో మమేకం కావడమే కాదు.. అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యారు. అదే విషయమై మైఖేలో జో (తల్లిదండ్రులు ఆంగ్లో ఇండియన్లు) మాట్లాడుతూ.. “నాకు తెలిసి పార్క్ నగర్ లో ఇటాలియన్ బిషఫ్ బరాటా ఉండేవారు. ఆయనే పార్క్ నగర్ ను అభివృద్ధి చేశారు. ఖాజీపేట లో సెయింట్ జోసఫ్ ఫారిస్ ఉండేవారు. చాలా మంది ఆంగ్లో ఇండియన్లు ఖాజీపేటకు వచ్చి సెటిల్ అయ్యారు. చర్చికి వాళ్లు స్టైల్ గా వచ్చేటోళ్లు. లేడీస్ అయితే రౌండ్ హ్యాట్, పైన ఫ్లవర్ ఉండేది. జెంట్స్ షూట్, టై, షూ కంపల్సరీ ఉండేవి. రైల్వే క్వార్టర్స్ లో అంతా ఆంగ్లోస్ ఉండే వారు. చాలా మంది ఆర్మీ నుంచి వచ్చారు. మా తాత కూడా. సెకండ్ వరల్డ్ వార్ లో మా తాత ఫైట్ చేసినప్పుడు ఇచ్చిన షీల్డ్ చైనా మ్యూజియంలో పెట్టారు. మా డాడీ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు”.. అంటూ నాటి సంగతులు చెప్పుకొచ్చారు.
