Real Story of an Indian Loco Pilot
* క్యాబిన్‌లోనే పండగలు.. పుట్టినరోజులు..
* టాయిలెట్ అర్జంట్ అయితే .. నరకమే.. ?
* ప్రతీ నిమిషానికి ఆ గేర్ టచ్ చేయాలి
ఆకేరు న్యూస్ , వరంగల్ :
హనుమకొండ జిల్లా , కాజీపేట మండలం కుమ్మరిగూడెంకు చెందిన ఆరూరి కుమారస్వామి. దాదాపు 35 సంవత్సరాలు లోకో పైలట్‌గా పని చేశారు. విశ్రాంత జీవనంలోనూ ఆ రైలు శబ్దాలు, జ్ఞాపకాలతో సహజీవనం చేస్తున్నారు. కుటుంబ జీవనాధారం కోసం చిన్నతనం నుంచి సాధారణ కూలి పనులు చేస్తూ లోకో పైలట్ స్థాయికి ఎదిగిన ఆయన జీవన సిత్రం ను ఆకేరు న్యూస్ కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆవిష్కరించారు. లోకానికి తెలియని లోకో పైలట్ విధులు, రైలు గమ్యస్థానానికి చేరే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్న ఆసక్తికర అంశాలు ఆయన మాటల్లోనే..
* ఆహా.. ఆ క్షణం అద్భుతం..
సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేను లోకోపైలట్ (రైలు డ్రైవర్ ను లోకోపైలట్ అంటారు) అయితున్నా అంటే ఇది ఎంత సంతోషకరమంగా ఉంటుంది. ఆ క్షణాలను మర్చిపోలేం. తక్కువ మార్కులతోని ఎస్ఎస్ఎస్సీ, ఐటీఐ చేసిన నేను ఒక గ్యాంగ్ మన్ నుంచి డీజిల్ క్లీనర్, కళాసీ, హెల్పర్, టెక్నీషియన్ ఒక లోకో పైలట్ అయ్యాను . లోకో పైలట్ అవుతానని జన్మలో కూడా అనుకోలేదు.
‘ఆంధ్రప్రభ’ లో నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పుడు పత్రికలు బాగా చదివేవాడిని. మా విలేజ్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లు కేవలం పత్రిక చదివేదానికే పోయేవాడిని. ఆ క్రమంలో ఆ రోజులల్ల ఆంధ్రప్రభ పత్రికల నేను ఓ న్యూస్ చదివిన. నేను చదవడంతో పాటు మా ఫ్రెండ్స్ కు, చుట్టుపక్కల విలేజీల అందరికీ చెప్పిన. ఇట్లా రైల్వేలల్ల గ్యాంగ్ మెన్ గా వేకెన్సీస్ పడ్డాయట, అప్లై చేసుకోండి.. నేను కూడా దరఖాస్తు చేసుకుంటున్నా అని చెప్పినాను. 91 మందిలో నేను ఒక్కడినే ఎంపికయ్యాను..
* ఎందుకు వచ్చాను రా.. ఈ ఉద్యోగానికి..!
అసలు కథ రైలు నడుపుతుంటే తెలిసింది… మొదట్లో వచ్చిన సంతోషం ఆవిరయిపోయింది.. వామ్మో ఉద్యోగం ఇట్లుంటదని ముందే తెలిస్తే ఇందులోకి రాక పోయేవాడినని చాలా సార్లు అనుకున్నాను.
ఒక్కసారి ఉద్యోగం ఎక్కా మంటే కుటుంబాన్ని మరచి పోవాల్సిందే.. ఎందుకంటే లోకో పైలట్ మీద ఆధారపడి వందలాది కుటుంబాలు హాయిగా ప్రయాణం చేస్తాయి.. ఇప్పుడంటే సెల్ పోన్లు వచ్చినయి కాబట్టి ఎంతో కొంత ఊరట ఉంటుంది.. అప్పట్లో అలాంటి సౌకర్యాలేమి ఉండేవి కాదు.. అందుకే చాలా బాధ అనిపించేది.. ఆ తర్వాత క్రమంగా అసలు ఒక్క రోజు డ్యూటీకి వెళ్ళక పోయినా చాలా ఇబ్బందిగా అనిపించేది..
* రైల్వే ట్రాక్ కు కూడా లిమిట్స్ ఉంటాయి..
రైల్వేశాఖలో అప్పుడు గ్యాంగ్ మన్ అంటుండే. ఇప్పుడేమో ట్రాక్ మన్. 15 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళ లిమిట్ వీళ్ళకు ఒక జెఈ ఉంటాడు, . వీళ్ళ లిమిట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ నాలుగు కిలోమీటర్ల ట్రాక్ మరమ్మతులు ఉంటాయి కదా, ఈ ఆర్ అండ్ బి వాళ్ళది ఎట్లా ఉంటాయో ఈ ట్రాక్ కూడా అట్లా లిమిట్స్ ఉంటాయి. ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ల ఈ ట్రాక్ మరమత్తులంతా ఈ గ్యాంగ్ మన్ చూస్తాడు. వాళ్ల మీద మరొకరు.. వాళ్ల మీద సెక్షన్ ఇంజినీర్ ఉంటాడు. వీళ్ళ ఇప్పుడు అంతా అల్ట్రా సౌండ్, అల్ట్రా స్కానింగ్ అనే మిషన్స్ వచ్చినాయి, అప్పుడు మేము చేసే జమాన్లో ఈ మిషన్స్ ఏమ లేవు. అప్పటికీ, ఇప్పటికీ చాలా అప్డేట్ అయిపోయింది..రైల్వే ట్రాక్ ఒకదానికొకటి కొంత ఎడంగా ఉండడానికి కారణం పట్టాలు ఎండకాలము, చలికాలము వ్యాకోచ, సంకోచాలు చెందుతాయి . చలికాలంలో దగ్గరికి వస్తాయి. ఎండకాలం విడిపోతా ఉంటాయి, . ఈ రెండింటి మధ్యన జాయింట్ వస్తది. ఆ జాయింట్ ని ఎస్ఈజే అని అంటారు. దీనివల్ల ట్రాక్ విరగకుండా, బెండ్ కాకుండా ఛాన్సెస్ ఉంటాయి. ట్రాక్ మెన్లు, కీ మెన్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సంబంధిత అధికారులకు చెపుతుంటారు.
* టాయిలెట్ అర్జంట్ అయితే .. నరకమే.. ?
రైలు ఇంజిన్ క్యాబిన్ లో టాయిలెట్స్ లేవు. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది.
క్లీన్ చేసే మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎమర్జెన్సీ టైంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక 15 మినిట్స్ టైం ఉంటది. ఇన్ కేస్ స్టేషన్ లిమిట్ అయితే స్టేషన్ మాస్టర్ తో వాకీ టాకీల ‘ఎమర్జెన్సీ కాల్ మాస్టర్ గారు’ అని చెప్పుకొని బండి ఆపుకొని పోయేస్తారు. కొంతమంది మాస్టర్లు కూడా టాయిలెట్ వాడడానికి నిరాకరిస్తారు కొంతమంది అనుకూలంగా ఉంటారు. ఆ క్రమంలో మాస్టర్ దగ్గరికి పోయి ఆ టాయిలెట్స్ యూస్ చేసుకొని వస్తాం. ఒకవేళ స్టేషన్ బయట అనుకోండి, ఎమర్జెన్సీ అయితే కొంత టైం అనేది ఉంటది, ఒక 10, 15 మినిట్స్. బండి ఆపుకొని పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.. అయినా అట్లాంటి అవసరాలు ఏం రావు. ఎందుకంటే లోకో పైలట్ అంటేనే క్షణ క్షణం అలర్ట్ గా ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు.
* రైలు కింద పడడానికి వచ్చినప్పుడు…. భయానకం.. బాధాకరం..
ఎవరైనా వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి వస్తారు. ఏ లోకో పైలట్ అయినా ఏ మాత్రం అవకాశం ఉన్నా అతనని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు.. ఒకవేళ ట్రాక్ కర్వ్ ఉంటది, బండి స్పీడ్ గా వెళుతున్న సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. మనం బండి సడన్ గా ఆపినామనుకో ట్రైన్ అంతా డిస్టర్బ్ అయిపోతది. బండి ఆగడము, బ్రేక్ పైపులు ఊడిపోతాయి. . నేను అసిస్టెంట్ డ్రైవర్ గా ఉన్నప్పుడు ఒక బర్రె వచ్చింది. ట్రైన్ కింద పడి చనిపోయింది. అప్పుడు ఒక వారం పది రోజుల దాకా డిప్రెషన్ గురైపోయినా, ‘అబ్బా ఒక మూగజీవి చనిపోయింది కదా, ‘ అని బాగా బాధపడేవాన్ని.
బ్రేక్ పట్టేసినాయి, హెవీ ఫైర్ వస్తుంది.. బండి ఆపొచ్చా సార్ అంటే మాస్టర్ రెస్పాన్స్ లేదు..
నేను గూడ్స్ లోకో పైలట్ గా చేస్తున్న సందర్భంలో రేచిని నుంచి అటు బల్లార్షా వైపు పోతున్నా. ట్రైన్ల ఐరన్ లోడ్ ఉంది. రేచిని దాటిన తర్వాత బ్రేక్ బైండింగ్ అయింది. బండి స్మోక్ వస్తుంది, వీల్స్ పట్టేసినాయి.. నేను ఇట్లా కర్వ్ లో చూసేసరికి అది కనిపిస్తుంది. ఆ ముందు రేపల్లెవాడ స్టేషన్ వస్తది, మార్గ మధ్యంలో మళ్లా వేరే ఏముండదు. ఆసిఫాబాద్ వస్తది. ఆ క్రమంలో నేను దగ్గర్లో ఉన్న మాస్టర్‌తో ‘మాస్టర్ గారు మరి నా బండి ఇట్లా బ్రేక్ బైండ్ అయిందని అడిగితే మాస్టర్ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఏదైనా జరగరానిది జరిగితే తను బద్ నాం కాకుండా ఉండడానికి ఆయన రెస్పాండ్ కాలేదు.. ఇక 60 కేఎంపీహెచ్ పోయే బండిని మెల్లగా 10 నుంచి 15 కేఎంపీహెచ్ వేగం తగ్గించి … ఆసిఫాబాద్ దాకా తెచ్చి, మాస్టర్ తో చెప్పి మొత్తం మీద సెక్షన్ క్లియర్ చేసిన. మాస్టర్ తో హోమ్ సిగ్నల్ ఉంటది, లోపలికి ఎంటర్ కావాలంటే అదవసరం. ‘మాస్టర్ గారు బ్రేక్ బైండింగ్, అయిందండి, బండి స్టేషన్ లో ఆపుకునే పరిస్థితి వస్తది’ అని చెప్తే ‘సరే మంచిది రండి’ అని అన్నాడు.
* ఆ చిన్నా క్యాబినే మా ప్రపంచం..
లోకో పైలట్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక 12 నుంచి 14 గంటలు ఆ కేబిన్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ క్యాబిన్ల. ఇక గూడ్స్ ట్రైన్ అయితే ఎక్కడ ఆపుతాడో, ఎక్కడికి గమ్యమో తెలియదు. గంటల గంటలు ఆ క్యాబిన్ లో కూర్చోవాల్సి వస్తది. ఆ క్రమంలో రైల్వేకి సంబంధించిన బుక్స్ గాని, ఏమన్నా మాన్యువల్స్ కొత్త ఎస్‌ఓబీలు ఉంటాయి. డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఉంటాయి అవన్నీ నెమరేసుకుంటాం. ఎప్పటికప్పుడు చదువుకోవాలి, నిరంతరం విద్యార్థినే. ఎప్పుడు ఏమైతదో తెలియదు, ఏ రిమార్క్ వస్తదో తెలియదు. అడవిలో బండి ఆగుతది, అక్కడ టెక్నీషియన్ ఉండరు. ఎవరూ ఉండరు. లోక్ పైలట్ తన పరి జ్ఞానంతోనే రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
* ప్రతీ నిమిషానికి ఆ గేర్ టచ్ చేయాలి..
ఒక ట్రైన్ కాజీపేట నుంచి హసనపర్తికి బిట్వీన్ ఒక 10, 15 మినిట్స్ ల్ల పోవాలి. పోయింది అని అంటే అసిస్టెంట్ లోకో పైలట్, అలర్ట్ గా ఉన్నట్టే. ఇప్పుడు కాజీపేటలో బయలుదేరుతాం, నెక్స్ట్ స్టేషన్ హసనపర్తి వస్తది, నెక్స్ట్ స్టేషన్ ఉప్పల్ వస్తది, నెక్స్ట్ జమ్మికుంట వస్తది. సికింద్రాబాద్ లో ఉన్న కంట్రోలర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాడు.. లోకో పైలట్ అలర్ట్ గా ఉన్నారా లేదా అని తెలపడానికి ఇంజన్ లో ఒక గేర్ ఉంటుంది. దాన్ని ఎప్పటికీ టచ్ చేస్తూంటే వీళ్ళు అలర్ట్ ఉన్నారని తెలుస్తుంది. ప్రతి 60 సెకండ్లకు ఒకసారి బజర్ సౌండ్ వస్తది, ఆ బజర్ ను దాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్నాలెడ్జ్ చేస్తే ఆ బజర్ సౌండ్ బంద్ అవుతుంది . అంటే మనం అలర్ట్ గా ఉన్నట్టు. ఒకవేళ ఎక్నాలెడ్జ్ చేయలేదు అనుకో మళ్ళీ నెక్స్ట్ 8 సెకండ్లకు మళ్ళీ బజర్ సౌండ్ తో వస్తది. అప్పుడు కూడా అలర్ట్ కాలేదు అని అంటే నెక్స్ట్ 8 సెకండ్స్ కు మళ్లీ వస్తుంది.. అప్పడు కూడా అటెండ్ చేయకపోతే ప్రమాదంలో ఉన్నట్టు భావిస్తారు.. వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటారు. అదే విదంగా ఎప్పుడైనా గాని ఒక డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ అనేవాళ్ళు డ్యూటీ ఎక్కగానే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడు వాడుకోవాలి అంటే సాంకేతిక లోపము ఏదైనా వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేసి ఆన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళా స్విచ్ ఆఫ్ చేయాలి.
* 35 ఏళ్ల సర్వీస్.. వేల కిలోమీటర్ల ప్రయాణం. .
దాదాపు 35 ఏళ్ల సర్వీస్.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. రిటైర్మెంట్ తర్వాత కూడా.. డ్యూటీలో ఉన్న అనుభవాలన్నీ నెమరేసుకుంటాను. రైలుబండితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది… పట్టాల సౌండ్, ఇంజన్ హారన్ ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి.
———————————
