GWMC Commissioner Venkanna Poster Ban Warning
* ప్రభుత్వ భవనాలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు
* జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు
అకేరు న్యూస్ డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, విద్యుత్, టెలిఫోన్ స్థంభాలు, సెంట్రల్ మీడియన్లు, రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ నిర్మాణాలపై అనధికారికంగా పోస్టర్లు అతికించడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పేర్కొన్నారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ మాట్లాడుతూ, నగర సౌందర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, విద్యుత్, టెలిఫోన్ స్థంభాలు, సెంట్రల్ మీడియన్లు, రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయడం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు.
ఇప్పటికే అనధికారికంగా ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇకపై అనుమతి లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంస్థలు, నిర్వాహకులపై మున్సిపల్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రకటనలు, ప్రచార బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ముందస్తు అనుమతులు పొందిన అనంతరం, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
నగర సుందరీకరణ, పరిశుభ్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు జీడబ్ల్యూఎంసీ నిబంధనలను పాటిస్తూ నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ టి. వెంకన్న విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
