Hanumakonda Collector Chahat Bajpai inspected JNS
* ప్రభుత్వ క్రీడా పాఠశాల, జేఎన్ఎస్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించిన హనుమకొండ జిల్లా కలెక్టర్
అకేరు న్యూస్, హనుమకొండ : విద్య, క్రీడలు రెండింటిలోనూ రాణించేలా విద్యార్థులు ఎదగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నాలుగో, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్ల, తెలుగు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. జాతీయ జెండా విశిష్టత, అశోక ధర్మచక్రం ప్రాధాన్యతపై విద్యార్థులు తెలిపిన సమాధానాలను అభినందించారు.
విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు వారి సహజ ప్రతిభను గుర్తించి, ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, కోచ్‌లకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా శిక్షణ అందించడం ఎంతో అవసరమన్నారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారికి అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం నాణ్యత, వసతి, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డికి ఆదేశించారు.

అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, భోజనశాల, వంటశాల, వసతి గృహాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా నాలుగో తరగతి విద్యార్థులకు కలెక్టర్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి, బాగా చదువుకోవడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.
అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్ హాల్, ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై యువజన సేవలు మరియు క్రీడల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
* స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..
అనంతరం జిల్లా యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్‌ను కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును సమీక్షించారు. స్విమ్మింగ్ పూల్, వాటర్ పైప్‌లైన్ వ్యవస్థ, జిమ్ సెంటర్, ఇతర మరమ్మత్తు మరియు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌లో జరుగుతున్న మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు, క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్విమ్మింగ్ పూల్ సేవలను వినియోగించుకునేలా అవసరమైన అన్ని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. నిర్వహణలో లోపాలు తలెత్తకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని, తరచూ మరమ్మత్తులు అవసరం లేకుండా శాశ్వత పరిష్కారాలతో నిర్వహణ చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్వహణ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకొని, అవసరమైతే సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్‌కుమార్, యువజన సేవలు మరియు క్రీడల శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
