* ఐదు నెలలుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
* వేల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖేష్ అంబానీ
* తాజాగా మరో కీలక నిర్ణయం
* నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వార్తలు సంచలనంగా మారుతున్నాయి. జులై నెల 2న జరగబోయే వారి వివాహ వేడుకకు సంబంధించి ఐదు నెలల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ ప్రముఖులు, మార్క్ జుకర్‌బర్గ్ నుంచి బిల్ గేట్స్ వరకు ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ తొలి సెషన్ లో వారితో పాటు కెనడా, స్వీడన్, ఖతార్ నుండి పలువురు రాజకీయ నాయకులు, భూటాన్ రాజు, రాణి, ఇవాంక ట్రంప్ కూడా హాజరయ్యారు. అతిరథ మహారథులెందరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కాలు కదిపి చిందేశారు. ఇక రెండవ ప్రీ వెడ్డింగ్.. క్రూజ్‌లో 4,400 కి.మీ ప్రయాణిస్తూ జరుపుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హంగులు ఆడంబరాలు, ఆర్భాటాలతో పాటు పెళ్లిని పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలను కూడా అంబానీ నిర్వహిస్తున్నారు.
సామూహిక వివాహాలు
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి (Anant Ambani – Radhika Merchant wedding) ముహూర్తం సమీపిస్తోంది. ఇంకొద్ది రోజుల్లో వారి వివాహ వేడుక అత్యంత ఆడంబరంగా జరగనుంది. కాగా, అంబానీ కుటుంబం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేద ప్రజల కోసం సామూహిక వివాహాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జులై 2వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని పాల్ఘర్లో గల స్వామి వివేకానంద విద్యా మందిర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ వేడుకలకు సంబంధించిన ఓ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
——————–